తెలంగాణలోని పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈసారి కేవలం చదువుకే పరిమితం కాకుండా విద్యార్థుల మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి క్యాలెండర్‌లో పెద్దపీట వేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న నేపథ్యంలో.. క్యాలెండర్‌లోనే ప్రతిరోజూ క్రీడలు, ఆటలు నిర్వహించాలనే నిబంధనను విద్యాశాఖ పొందుపరిచింది.కొత్త నిబంధనల ప్రకారం.. పాఠశాలల్లో పిల్లలకు సాధారణ బోధనతో పాటు ప్రతిరోజూ క్రీడలు నిర్వహించాలి. విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంచేందుకు కథల పుస్తకాలు, పత్రికలు, మ్యాగజైన్లు లాంటి వాటిని రోజుకు అరగంట పాటు చదివించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వీటితో పాటు, ప్రార్థన సమయంలో లేదా అది పూర్తయిన తర్వాత తరగతి గదిలో ఐదు నిమిషాల పాటు విద్యార్థులకు యోగా లేదా ధ్యానం చేయించటం తప్పనిసరి చేశారు.ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు మొత్తం 227 రోజుల పాటు పనిచేస్తాయి. పదో తరగతి సిలబస్‌ను 2027 జనవరి 10వ తేదీ నాటికి, మిగిలిన తరగతులకు ఫిబ్రవరి 28 నాటికి పూర్తి చేయాలని అధికారులు గడువు విధించారు. వచ్చే ఏప్రిల్‌ 23వ తేదీ పాఠశాలలకు చివరి పనిదినంగా ఉంటుంది. వచ్చే సంవత్సరం (2027) వేసవి సెలవులు ఉంటాయి. 2027 మార్చి 15 నుంచి చివరి పనిదినం వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. తొలిసారిగా ఈ ఒంటిపూట బడుల తేదీలను విద్యా క్యాలెండర్‌లోనే ముందుగా ప్రకటించడం విశేషం.ఇక ప్రతి నెలా మూడో శనివారం విద్యార్థులకు నో బ్యాగ్‌ డేగా అమలు చేస్తారు. అదే రోజున అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సమావేశాలు కూడా జరపాలి. 1 నుంచి 9వ తరగతి చదివే విద్యార్థులకు భోజన విరామం తర్వాత సెప్టెంబరు వరకు ప్రతిరోజూ ఒక సబ్జెక్టుపై ప్రత్యేకంగా రెమిడియల్‌ తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. దీనివల్ల చదువులో వెనుకబడిన విద్యార్థులు సబ్జెక్టులపై అవగాహన పెంచుకునే అవకాశం లభిస్తుంది. కాగా.. మే 14న ప్రారంభమైన బడిబాట కార్యక్రమాన్ని ఈ నెల 19 వరకు కొనసాగించాలని విద్యాశాఖ ఆదేశించింది. అలాగే.. గత ఏడాది స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలను 6 నుంచి 7కు పెంచగా.. ఈసారి మళ్లీ వాటిని 6కు తగ్గించారు. ఈ సమావేశాలు జులై, ఆగస్టు, సెప్టెంబరు, నవంబరు, డిసెంబరు, ఫిబ్రవరి నెలల్లో జరుగుతాయి.విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు వివిధ సైన్స్ ప్రదర్శనల షెడ్యూల్‌ను క్యాలెండర్‌లో చేర్చారు. రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన 2025-26 జాతీయస్థాయి ఎగ్జిబిషన్‌ను అక్టోబరులో నిర్వహించనున్నారు. 2026-27 సంవత్సరానికి సంబంధించి జిల్లా స్థాయి పోటీలను నవంబరు లేదా డిసెంబరులో, రాష్ట్రస్థాయి పోటీలను డిసెంబరు లేదా జనవరిలో జరుపుతారు. సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్ 2027 జనవరిలో నిర్వహించనున్నారు.