రాయలసీమ రైతులకు లాభాలు కురిపిస్తున్న పంట.. ఎకరాకు రూ.40వేల వరకు ఆదాయం!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి.. రైతులు ఖరీఫ్ సాగు కోసం సిద్ధమయ్యారు. ఈ ఏడాది రాయలసీమ రైతులు ఎక్కువశాతం కందిని సాగు చేయాలని చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధిక విస్తీర్ణంలో వేరుశెనగ సాగు కోసం విత్తనాల పంపిణీకి సిద్ధమైంది. వేరుశెనగ మొత్తం 2.20 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ లక్ష్యం పెట్టుకున్నారు. రాష్ట్రంలో కంది విత్తనాలను 6,172 క్వింటాళ్లు రాయితీపై అందిస్తోంది.. ఈ విత్తనాలు లక్ష ఎకరాల వరకు సరిపోతుందని అంచనా వేస్తున్నారు. కంది విత్తనాలు కిట్స్ రూపంలో ఇస్తే మరో 50వేల ఎకరాలకు అదనంగా సరిపోతాయి. రాయలసీమలో పదేళ్ల క్రితం 2.75 లక్షల ఎకరాలున్న కంది సాగు.. 2025లో 5.59 లక్షల ఎకరాలకు పెరిగింది. వేరుశెనగ విషయానికి వస్తే పదేళ్ల క్రితం 22.58 లక్షల ఎకరాలు ఉంటే.. 2025లో 5 లక్షల ఎకరాలకు పడిపోవడం గమనార్హం. వాస్తవానికి రాయలసీమలో వేరుశెనగను అధికంగా సాగు చేస్తుంటారు. ఏకంగా 20 లక్షల ఎకరాల్లో సాగుచేసేవారు.. కానీ ఆ తర్వాత క్రమంగా సాగు తగ్గుతూ వచ్చింది. వేరుశెనగ సాగు చేయాలంటే పెట్టుబడి రైతులకు భారంగా మారింది. దీనికి తోడు ప్రతికూల వాతావరణ పరిస్థితులు, గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు వేరశెనగ సాగుపై ఆసక్తిగా ఉండటం లేదు. గతేడాది కేవలం 5 లక్షల ఎకరాలకు పరిమితమైందంటే పరిస్థితిన అర్ధం చేసుకోవచ్చు. వేరుశెనగ వర్షాధారంగా సాగు చేస్తే రైతుకు ఎకరాకు రూ.35 వేల వరకు ఖర్చవుతోంది. దిగుబడి 2.50 క్వింటాళ్ల నుంచి 4 క్వింటాళ్ల వరకు ఉంటోందని చెబుతున్నారు. వర్షాలు పెరిగినా, అసలు వర్షాలు లేకపోయినా దిగుబడి సరిగా ఉండటం లేదు.. తెగుళ్ల బెడద తప్పడం లేదు. రాయలసీమ రైతులు వేరుశెనగ సాగుకు బదులుగా కంది సాగుపై ఆసక్తిగా ఉన్నారు. రాయలసీమలో 2025 ఖరీఫ్‌లో ఏకంగా 5.59 లక్షల ఎకరాల్లో కంది సాగు చేశారు. వేరుశెనగతో పోలిస్తే కంది సాగుకు పెట్టుబడి తక్కువ.. ఎకరా కంది సాగుకు పెట్టుబడి సగటున రూ.20 వేల నుంచి రూ.25 వేలు అవుతోంది. ఎకరాకు 5 క్వింటాళ్లు దిగుబడి వచ్చినా రూ.40వేలు ఆదాయం వస్తోందని చెబుతున్నారు. కొంతమంది రైతులకు ఎకరాకు 9 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కంది క్వింటాకు రూ.8,450 పలకడంతో రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కందిలో పంటకాలం ఎక్కువగా ఉండే రకాల్ని 30% రాయితీపై ఎకరాకు 4 కిలోల చొప్పున రైతులకు అందిస్తోంది. దాదాపు 150 రోజులకు పంట వస్తుందని చెబుతున్నారు. రైతులు మాత్రం ప్రైవేట్ కంపెనీల విత్తనాల్ని కొనుగోలు చేస్తున్నారు.. ఇవి పంటకాలం తక్కువ ఉంటాయంటున్నారు. ఈ విత్తనాలు కిలో రూ.200 వరకు ఉంటాయి.. ఎకరాకు 6 కిలోల విత్తనాలు సరిపోతాయి. ప్రభుత్వం తక్కువ పంటకాలం ఉండే విత్తనాలపై రాయితీ ఇవ్వాలని కోరుతున్నారు.