SIP Investments: చాలా మందికి పెట్టుబడులు పెట్టాలని ఉంటుంది. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలియక ముందే ఆగిపోతుంటారని చెప్పొచ్చు. అంటే ఆప్షన్లు చాలానే ఉన్నా.. ఏది ఎంచుకోవాలో తెలియక సతమతమవుతుంటారన్నమాట. అయితే మనకు ఇక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటివి ఉన్నా.. ఇక్కడ రిస్క్ ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో మంచి రాబడి వస్తుందని చెబుతుంటారు. అదే రిస్క్ లేని పెట్టుబడి సాధనాల విషయానికి వస్తే బ్యాంక్ ఎఫ్‌డీ, పోస్టాఫీస్ స్కీమ్స్, ఆర్బీఐ బాండ్లు వంటివి ఉంటాయి. కానీ ఇక్కడ రాబడి స్థిరంగా ఉన్నా.. అది అంతలా ద్రవ్యోల్బణాన్ని మించేలా ఉండకపోవచ్చు. అందుకే.. రిస్క్ ఉన్నా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతుంటారు.అయితే స్టాక్ మార్కెట్లతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ ఫ్యాక్టర్ కాస్త తక్కువగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లలో నేరుగా రిస్క్ ఉంటే.. మ్యూచువల్ ఫండ్లలో ఫండ్ మేనేజర్ మీ పెట్టుబడుల్ని వేర్వేరు స్టాక్స్, ఇతర ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. వైవిధ్యభరిత పెట్టుబడుల కారణంగా రిస్క్ తగ్గుతుంది. దీర్ఘకాలంలో ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కారణంగా సంపద పెరుగుతుంటుంది. ఇప్పుడు ఇలానే పెట్టుబడి పెట్టి ఓపికతో చాలా కాలం ఎదురుచూసిన వారికి కాసుల పంట పండించిన ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ గురించి మనం తెలుసుకుందాం.అదే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్‌ నిర్వహిస్తున్న (ఎర్స్ట్ వైల్ టెంపుల్టన్ ఇండియా ఈక్విటీ ఇన్‌కం ఫండ్). ఇది 20 ఏళ్లలో ఇన్వెస్టర్లకు అద్భుత స్థాయిలో రిటర్న్స్ అందించింది. ఇక్కడ నెలకు రూ. 10 వేల చొప్పున సిప్ పెట్టుబడి పెట్టిన వారికి 2026 ఏప్రిల్ నాటికి అంటే 20 ఏళ్లలో రూ. 1.20 కోట్లు అందించడం విశేషం. ఇక ఈ ఫండ్ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ. 2300 కోట్లు దాటింది. ఈ పథకం పనితీరుకు కొలమానంగా నిఫ్టీ డివిడెండ్ అపార్చునిటీస్ 50 ఇండెక్స్ ఉంది. ఇది డివిడెండ్ ఈల్డ్ ఓరియెంటెడ్ ఈక్విటీ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీని అనుసరిస్తుంది. అంటే ప్రధానంగా డివిడెండ్ చెల్లించే లేదా ఆకర్షణీయమైన డివిడెండ్ ఈల్డ్ సామర్థ్యం ఉన్నటువంటి ఈక్విటీ స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తుంటుంది. తన మొత్తం ఆస్తుల్లో దాదాపు 85 నుంచి 90 శాతం వరకు ఈక్విటీ, ఈక్విటీ రిలేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో పెట్టుబడులు పెడుతుంది. లంప్‌సమ్ పెట్టుబడుల విషయానికి వస్తే ఇక్కడ స్కీమ్ లాంఛింగ్ సమయంలో (2016) రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి రూ. 13.60 లక్షలు వచ్చాయి. ఇక్కడ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (CAGR) 13.97 శాతంగా ఉంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, పవర్ అండ్ ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎఫ్ఎంసీజీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఆటోమొబైల్స్, టెలికాం, కన్జూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లోని స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతుంది. Disclaimer: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు స్టాక్ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. కాబట్టి వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అప్పుడే రిస్క్ లేకుండా కాస్త మెరుగైన రిటర్న్స్ అందుకునేందుకు అవకాశం ఉంటుంది.