బంజారాహిల్స్ నీలోఫర్ కేఫ్‌కు బిగ్ షాక్.. ఎన్‌వోసీ రద్దు చేసిన అగ్నిమాపక సిబ్బంది

Wait 5 sec.

హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే, బాగా ఫేమస్ అయిన నీలోఫర్ కేఫ్‌లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న ఈ నీలోఫర్ కేఫ్‌లో అగ్నిమాపక శాఖ రూల్స్‌ను ఉల్లంఘిస్తున్నారని.. అదే సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండానే నాలుగో ఫ్లోర్‌లో రెస్టారెంట్‌ను నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే బిల్డింగ్‌కు జారీ చేసిన ఫైర్ ఎన్‌ఓసీ (నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్)ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కేఫ్ నీలోఫర్‌కు వచ్చే కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.ఇటీవలి కాలంలో హైదరాబాద్‌ నగరంలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటుండటం.. వాటివల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తున్న నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తమై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నీలోఫర్ కేఫ్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫైర్ లైసెన్స్ రూల్స్‌ను అతిక్రమించి.. నీలోఫర్ కేఫ్ యాజమాన్యం పలు అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఇరుకైన మార్గాలు.. రూల్స్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని.. ఏదైనా కారణంతో అగ్నిప్రమాదం జరిగితే.. కస్టమర్ల ప్రాణాలకు, ఆస్తులకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తనిఖీ రిపోర్ట్‌లో స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే అధికారుల తనిఖీలు చేసిన నివేదికను పరీశీలించిన తెలంగాణ అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్.. నీలోఫర్ కేఫ్ సంస్థకు గతంలో జారీ చేసిన ఫైర్ ఎన్‌ఓసీని తక్షణమే రద్దు చేస్తున్నట్లు.. ఉత్తర్వులు జారీ చేశారు. అగ్నిప్రమాదాల నివారణకు ప్రజలు, వాణిజ్య సంస్థలు అవసరమైన అన్ని రకాల భద్రతా చర్యలను కచ్చితంగా పాటించాలని డీజీ విక్రమ్ సింగ్ మాన్ తేల్చి చెప్పారు. ఫైర్ లైసెన్స్ పొందిన సంస్థల ఓనర్లు లైసెన్స్ నిబంధనలకు అనుగుణంగానే వ్యాపారాలను నడిపించాలని సూచించారు. రూల్స్ అతిక్రమించి.. అదనపు నిర్మాణాలు చేపట్టినా.. అనుమతి లేని వ్యాపారాలు చేసినా.. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలకు రక్షణమే తమకు అత్యంత ప్రాధాన్యమని ఆయన తేల్చి చెప్పారు.