అమెరికాతో శాంతి చర్చలకు సంబంధించిన అవగాహన ఒప్పందం వివరాలను ఇరాన్ తాజాగా వెల్లడించింది. పూర్తిస్థాయి కాల్పుల విరమణ, 60 రోజుల అణు చర్చలు, ఆంక్షల మినహాయింపు సహా మొత్తం 14 అంశాలతో కూడిన అవగాహన ఒప్పందం ప్రతిపాదనల గురించి ప్రతినిధుల బృందంలోని సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ఇరాన్ అధికారిక వార్తా సంస్థ మెహర్ నివేదించింది. ఇరాన్ నాయకత్వంలోని అత్యున్నత స్థాయిలో ఒక ఒప్పందం సూత్రప్రాయంగా కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ అవగాహన ఒప్పందం (MoU) ప్రకారం అన్ని రంగాల్లో యుద్ధం తక్షణమే నిలిపివేయడం, ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయబోమని ప్రకటన, అణు కార్యక్రమం సమస్యను పరిష్కారానికి చర్చలు ప్రారంభమవుతాయి. అవగాహన ఒప్పందంలోని 14 అంశాలు1. లెబనాన్ సహా అన్ని రంగాల్లో తక్షణమే యుద్ధం నిలిపివేయడం, పూర్తిస్థాయి శాశ్వత కాల్పులు విరమణ.2. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తామని అమెరికా నిబద్ధత.3. 30 రోజుల్లోగా నేవీ దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయడం.4. ఇరాన్ చుట్టుపక్కల అమెరికా తన దళాలను ఉపసంహరించడం.5. ఇరాన్ నిర్ధారించిన ఏర్పాట్ల ప్రకారం 30 రోజుల్లోగా హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం.6. చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, వాటి ఉత్పన్నాల అమ్మకంపై ఆంక్షలు తొలగించి, తద్వారా లభించే ఆర్థిక వనరులను ఇరాన్ పూర్తిగా వినియోగించుకునేలా చేయడం.7. అమెరికా, దాని మిత్రదేశాలు ఇరాన్ కోసం కనీసం 300 బిలియన్ డాలర్ల విలువైన పునర్నిర్మాణ ప్రణాళికలను సమర్పించాలనే నిబంధన.8. అణు సమస్యలు, అమెరికా ప్రాథమిక, ద్వితీయ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడం, అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ గవర్నర్ల బోర్డు సంబంధిత తీర్మానాలపై దృష్టి సారించి, తుది ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే లక్ష్యంగా అరవై రోజుల పాటు చర్చలు జరపాలి.9. అణు నిరాయుధీకరణ ఒప్పందం (NPT) కింద అణ్వాయుధాలను ఉత్పత్తి చేయబోమని ఇరాన్ తన నిబద్ధతను పునరుద్ఘాటించడం.10. చర్చల కాలంలో ఈ ప్రాంతంలో తన సైనిక బలగాలను పెంచబోమని, ఎటువంటి కొత్త ఆంక్షలను విధించబోమని అమెరికా హామీ ఇస్తుంది.11. 60 రోజుల చర్చల కాలంలో స్తంభింపజేసిన 24 బిలియన్ డాలర్ల ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం. ఈ మొత్తంలో సగం చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్‌కు అందుబాటులోకి తీసుకురావాలి.12. ఒప్పందం అమలును నిర్ధారించడానికి ఒక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం.13. తుది ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం ద్వారా ఆమోదిస్తారు.14. ఇరాన్ స్తంభింపజేసిన ఆస్తులలో సగం విడుదలయ్యే వరకు, చమురు ఆంక్షలు తొలగింపు, నేవీ దిగ్బంధనం ఎత్తివేసేవరకు తుది చర్చలు ప్రారంభం కావు. తుది ఒప్పందం ప్రత్యేకంగా ఈ అంశాలపై దృష్టి సారిస్తుంది.అంతేకాకుండా, ఇరాన్ క్షిపణి కార్యక్రమం గురించి హెజ్బొల్లా, హమాస్, హౌతీల వంటి ఈ ప్రాంతంలోని ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేక వర్గాలకు ఇరాన్ ఇస్తున్న మద్దతు గురించి చర్చలకు ఆస్కారం లేదని ఈ అవగాహన ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇరాన్ విదేశాంగ శాఖ గతంలో వెల్లడించినట్టు అవగాహన ఒప్పందానికి ఇప్పటికీ సంబంధిత అధికారిక ఆమోదం అవసరమని మెహర్ నొక్కిచెప్పడం సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీని ఉద్దేశించినట్లుగా ఉంది.ఇరాన్‌తో ఒప్పందం త్వరలో జరగబోతోందని ట్రంప్ కనీసం 38 సార్లు ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్‌ అత్యున్నత స్థాయిలో అంగీకరించినట్లు ట్రంప్ చెబుతున్న అవగాహన ఒప్పందాన్ని (MoU) ఇరాన్ బయటపెట్టింది. కానీ, ఈ ఒప్పందానికి ఇంకా ఖమేనీ ఆమోదం అవసరం. ఈ ఒప్పందం వెనుక పాకిస్థాన్, తుర్కియేలే కీలక పాత్ర పోషించాయి. పాక్ నేతలతో చర్చల అనంతరం ట్రంప్ ఈ ప్రకటన చేశారు. గురువారం ఇరాన్‌పై దాడులను నిలిపివేయడానికి కొద్దిసేపటి ముందు వారితో ట్రంప్ చర్చలు జరిపారు.