‘పెద్ది’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌.. దిల్ రాజు ‘గేమ్ ఛేంజర్’పై సెటైర్లు!

Wait 5 sec.

రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ వేట ప్రారంభించింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ పాన్ ఇండియా చిత్రం, ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. దానికి తగ్గట్టుగానే రివ్యూలన్నీ దాదాపు పాజిటివ్ గా ఉన్నాయి. తొలి రోజు వసూళ్ల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బాక్సాఫీస్‌ ఛాంపియన్‌ అంటూ కలెక్షన్స్ పోస్టర్‌ రిలీజ్ చేశారు. అయితే ఇది చూపించి కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో నిర్మాత దిల్ రాజుపై సెటైర్లు వేస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా 'పెద్ది' సినిమా తెరకెక్కుతోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం.. గురువారం (జూన్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 135.36 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత మెగా పవర్ స్టార్ కి హిట్టు పడిందని సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో 'గేమ్ ఛేంజర్' సినిమా వసూళ్లను గుర్తు చేసుకుంటున్నారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'గేమ్ ఛేంజర్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాని నిర్మించారు. 2025 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మారింది. అయినప్పటికీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 186 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు నిర్మాతలు అఫిషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇవి ఫేక్ కలెక్షన్స్ అని అప్పట్లోనే తెగ ట్రోలింగ్ జరిగింది. నిర్మాణ సంస్థ అధికారికంగా దొంగ లెక్కలు చెప్పిందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. లాంగ్ రన్ లో రూ.200 కోట్లు కూడా రాబట్టిన సినిమాకి, మొదటి రోజు అన్ని కలెక్షన్స్ ఎలా వచ్చాయంటూ ఇప్పటికీ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు 'పెద్ది' సినిమా వసూళ్లు ప్రకటించడంతో, 'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ను గుర్తు చేస్తున్నారు. 'పెద్ది' సినిమాకి ప్రీమియర్స్, టికెట్ రేట్స్ హైక్స్, పాజిటివ్ టాక్ తో ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.135.36 కోట్లు వస్తే.. ఫుల్ నెగిటివ్ టాక్ వచ్చిన 'గేమ్ ఛేంజర్' మూవీకి రూ. 186 కోట్లు ఎలా వచ్చాయని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అవి ఒరిజినల్ వసూళ్లా కాదా అనేది దిల్ రాజే చెప్పాలని కామెంట్లు పెడుతున్నారు. దీనికి సంబంధించిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.