"ఏక్ పేడ్ మా కే నామ్".. తల్లి పేరిట తెల్లపొణికి మొక్క నాటిన పవన్ కళ్యాణ్.. దాని ప్రత్యేకతలు ఇవే..

Wait 5 sec.

రాష్ట్రంలో వనసంపద పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నడుం బిగించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏక్ పేడ్ మా కే నామ్ స్ఫూర్తితో తల్లి అంజనా దేవి పేరుతో తెల్లపొణికి మొక్క నాటారు పవన్ కళ్యాణ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి సమీపంలోని మూలపాడు బటర్ ఫ్లై పార్కును పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. అనంతరం తల్లి అంజనా దేవి గారి పేరుతో మూలపాడు బటర్ ఫ్లై పార్కులో తెల్ల పొణికి మొక్కని నాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ భూమిని, పచ్చదనాన్ని కాపాడుకోవడం మన అందరి కనీస బాధ్యతగా పేర్కొన్నారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా నాటి, దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “ఏక్ పేడ్ మా కే నామ్” థీమ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తి పేరిట ఒక మొక్క నాటాలని పవన్ కళ్యాణ్ సూచించారు. తల్లి జీవం పోస్తే.. అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందన్నారు పవన్ కళ్యాణ్. కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1,000 తెల్లపొణికి చెట్లను ఒకే చోట నాటడం ఆనందం కలిగించిందన్నారు. ఈ రోజు నుంచి జూన్ 15 వరకు పది రోజులపాటు అన్ని జిల్లాల్లో సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.పవన్ కళ్యాణ్ నాటిన తెల్లపొణికి మొక్క ప్రత్యేకత ఇదే..తెల్లపొణికి మొక్క శాస్త్రీయ నామం Wrightia tinctoria. కొండపల్లి, ఏటికొప్పాక చెక్కబొమ్మల తయారీలో ఇది ఉపయోగపడుతుంది. హస్తకళల తయారీకి తెల్ల పొణికి చెట్టు కలప ఉపయోగపడుతుంది. ఇది చాలా మృదువుగా, తేలికగా, తెల్లగా ఉంటుంది. చెక్క బొమ్మలకు అవసరమైన ఆకారాలు చెక్కేందుకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆయుర్వేదంలో తెల్లపొణికి చెట్టుకు ప్రాముఖ్యత ఉంది. ఈ చెట్టు బెరడు, ఆకులు చర్మవ్యాధులు తగ్గించడానికి, కడుపులోని నులిపురుగుల నివారణకు ఉపయోగపడతాయి.భూగర్భ జలాలను పెంపొందించడానికి, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.