హైదరాబాద్ దగ్గర్లో 'తెలంగాణ శ్రీశైలం'.. మూడు గుండ్ల రహస్యం తెలుసా? అహం వీడితేనే శివయ్య వద్దకు దారి

Wait 5 sec.

మనిషి తన డబ్బును, హోదా, అధికారం చూసుకుని ఎంత అహంతో ఊగిపోయినా... ఆ భగవంతుడి ముందర మోకరిల్లక తప్పదు. దీనికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది తెలంగాణ శ్రీశైలంగా పిలిచే క్షేత్రం. ఇక్కడి కొండపై ఉన్న మూడు గుండ్లు అద్భుత ఆధ్యాత్మిక రహస్యాన్ని చాటుతాయి. ఎంతటి లావుపాటి మనిషైనా.. ఇక్కడి ఇరుకైన సందు గుండా సులభంగా దూరిపోయి శివలింగాన్ని దర్శించుకోవడం విశేషం. 'నేను' అనే అహంకారాన్ని, గర్వాన్ని వీడి, భక్తితో శివయ్యను తలుచుకుంటూ ముందుకు సాగితేనే ఆ పరమశివుడి దర్శనానికి మార్గం సుగమం అవుతుందని ఈ క్షేత్రం నిరూపిస్తోంది. నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి సమీపంలోని చెర్వుగట్టు ఉన్న శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేకమైనది. కొండపైన, ప్రకృతి రమణీయమైన వాతావరణంలో వెలసిన ఈ పుణ్యక్షేత్రాన్ని భక్తులు 'తెలంగాణ శ్రీశైలం' అని పిలుచుకుంటారు. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తరిస్తుంటారు. ఆధ్యాత్మిక పరంగా, చారిత్రక పరంగా ఎంతో విశిష్టమైన చరిత్ర కలిగిన ఈ ఆలయ స్థలపురాణం త్రేతాయుగం నాటి విశేషాలతో ముడిపడి ఉంది.పరశురాముడు ప్రతిష్ఠించిన శివ లింగంఆలయ స్థలపురాణం ప్రకారం.. విష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడి కథతో ఈ క్షేత్రానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. కామధేనువు వివాదంలో తన తండ్రి జమదగ్ని మహర్షిని చంపిన కార్తవీర్యార్జునుడిని, అలాగే భూమిపై క్రూరులుగా మారిన క్షత్రియ రాజులను పరశురాముడు 21 సార్లు భూప్రదక్షిణ చేసి సంహరిస్తాడు. ఆ క్షత్రియ వధ వల్ల కలిగిన ఘోర పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా దేశమంతటా 108 శివలింగాలను ప్రతిష్ఠించాలని నిశ్చయించుకుంటాడు. అలా ఆయన ప్రతిష్టించిన 108 శివలింగాలలో ఈ చెర్వుగట్టు కొండపై వెలసిన లింగమే ఆఖరిది (108వది) అని భక్తుల బలమైన నమ్మకం. పరశురాముడు ఇక్కడ ఘోర తపస్సు చేస్తున్న సమయంలో పరమశివుడు తన జటాజూటంతో (జడలతో), జగన్మాత పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడి శివలింగంపై జడల వంటి ఆకృతులు సహజంగానే కనిపిస్తాయి కాబట్టే స్వామివారికి 'జడల రామలింగేశ్వర స్వామి' అని పేరు వచ్చింది. పరశురాముడు తన గొడ్డలితో ఈ లింగం దైవత్వాన్ని పరీక్షించగా ఏర్పడిన గాటు ఇప్పటికీ ఈ శివలింగంపై స్పష్టంగా దర్శనమిస్తుంది.మూడు గుండ్ల రహస్యం ఇదే..ఈ ఆలయంలోని మరొక అద్భుతం 'మూడు గుండ్లు'. ఆలయ ప్రాంగణంలో మూడు పెద్ద బండరాళ్లు ఒకదానిపై ఒకటి ప్రకృతి సహజంగా అమరి ఉంటాయి. అత్యంత ఇరుకైన సందు గుండా పాకుతూ వెళ్లి మూడో రాయిపై ఉన్న శివలింగాన్ని భక్తులు దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి మహిమ ఏమిటంటే.. ఎంత లావుగా ఉన్న మనిషైనా స్వామివారిని స్మరిస్తూ వెళ్తే ఆ ఇరుకైన సందు గుండా అత్యంత సులభంగా అవతలికి వెళ్ళిపోవటం విశేషం. అలాగే, ప్రతి సంవత్సరం మాఘ మాసంలో ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు, జాతర అత్యంత వైభవంగా జరుగుతాయి. అగ్ని గుండాలు ప్రత్యేకం..ఈ ఉత్సవాలలో ప్రధాన ఘట్టం అగ్నిగుండాలు. భక్తులు, శివస్వాములు ఎలాంటి భయం లేకుండా ఆ నిప్పులపై నడుస్తూ మొక్కులు తీర్చుకుంటారు. ఈ అగ్నిగుండాలలో కందులు, ఆముదాలు వేసి మొక్కులు చెల్లించుకుంటే పాపాలు తొలగిపోయి, అనారోగ్య సమస్యలు రావని నమ్ముతారు. ఈ క్షేత్రంలో ప్రతి అమావాస్య రోజున వేలాది మంది భక్తులు కొండపైన, ఆలయ పరిసరాల్లో రాత్రి బస చేసి అమావాస్య నిద్రలు చేస్తారు. ఇలా చేయడం వల్ల గ్రహదోషాలు, మానసిక సమస్యలు, భూత ప్రేత బాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. స్వామివారి వెండి పాదుకల స్పర్శ కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉంటారు.హైదరాబాద్ నుంచి ఎలా చేరుకోవాలి..?హైదరాబాద్ ఎల్బీనగర్ నుంచి కేవలం 80 కి.మీ దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి 2 గంటల్లో చేరుకోవచ్చు. విజయవాడ జాతీయ రహదారి గుండా ప్రయాణించి నార్కట్‌పల్లి జంక్షన్ వద్ద అద్దంకి రోడ్డు వైపు 6 కిలోమీటర్లు వెళ్తే ఎల్లారెడ్డిగూడెం గ్రామం వద్ద చెర్వుగట్టు కొండ కనిపిస్తుంది. హైదరాబాద్ ఎంజీబీఎస్ లేదా ఎల్బీనగర్ నుంచి నల్లగొండ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సుల ద్వారా నార్కట్‌పల్లికి చేరుకుని అక్కచి నుంచి ఆటోల్లో వెళ్లవచ్చు. కొండపైకి నడిచే వారి కోసం 365 మెట్లు, వాహనాల కోసం ఘాట్ రోడ్డు మార్గం కూడా అందుబాటులో ఉన్నాయి.