వన్డే ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో చిత్తుగా ఓడిపోయింది. ప్రపంచ ఛాంపియన్ అయిన ఆసీస్.. చిన్న జట్టు బంగ్లాదేశ్ చేతిలో పరాజయం చవిచూసింది. 21 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్.. ఆస్ట్రేలియాను వన్డేల్లో ఓడించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బంగ్లాదేశ్.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.3 వన్డేలు, 3 టీ20 మ్యాచులు ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్ గడ్డపై అడుగుపెట్టింది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ బంగళవారం ఢాకాలో జరిగింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ జోష్ ఇంగ్లిస్.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు స్కోరు చేసింది. మొసద్దిక్ హొస్సేన్ 70 బంతుల్లో 86 రన్స్ చేశాడు.ఛేజింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు తొలి బంతికే షాక్ తగిలింది. ఓపెనింగ్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మార్నస్ లబుషేన్ (1) కూడా వెనుదిరిగాడు. కూపర్ కన్నోలీ (35), జోష్ ఇంగ్లిస్ (19) కూడా భారీ స్కోరు చేయలేకపోయారు. 47 రన్స్ చేశాక అలెక్స్ కేరీ కూడా ఔట్ కావడంతో దాదాపుగా ఖరారైపోయింది. అయితే జట్టు స్కోరు 42.2 ఓవర్లలో 191/9 వద్ద ఉండగా.. వర్షం అంతరాయం కలిగించింది. ఎంతకూ వాన తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం బంగ్లాదేశ్.. 86 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు.బంగ్లాదేశ్ బౌలర్లలో నహిద్ రాణా.. 4 వికెట్లతో సత్తాచాటాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ 2, మొసద్దిక్ హోస్సేన్ 2, తస్కిన్ అహ్మద్ 1 వికెట్ తీశారు. కాగా బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియా 21 ఏళ్ల తర్వాత వన్డే మ్యాచులో ఓడిపోయింది. బంగ్లాదేశ్ 2005లో రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆసీస్‌ను ఓడించింది.