: మహారాష్ట్రలోని పూణే ఫ్యామిలీ కోర్టు ఒక అసాధారణమైన తీర్పును వెలువరించింది. సొంతంగా నెలకు లక్షన్నరకు పైగా జీతం తీసుకుంటున్న భార్యకు కూడా భర్త నెలనెలా రూ.1.35 లక్షల భరణం చెల్లించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. సాధారణంగా ఆర్థిక స్థోమత లేని మహిళలకే కోర్టులు భరణాన్ని మంజూరు చేస్తాయనే భావన అందరిలోనూ ఉంటుంది. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా వచ్చిన ఈ తీర్పు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అసలేం జరిగిందంటే..?పూణేకు చెందిన సదరు దంపతులిద్దరూ ఉన్నత విద్యావంతులే. వీరు ఐటీ, కార్పొరేట్ రంగాల్లో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం భర్త నెలకు రూ.2,79,499ల స్థిర ఆదాయాన్ని పొందుతుండగా.. భార్య కూడా నెలకు రూ.1,41,436ల భారీ జీతాన్ని ఆర్జిస్తోంది. అంతేకాకుండా భర్త తన సంపాదన నుంచి వృద్ధులైన తన తల్లిదండ్రుల బాధ్యతలను, వారి వైద్య ఖర్చులను కూడా చూసుకుంటున్నాడు. అయితే పెళ్లయిన కేవలం ఆరు నెలలకే వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో మనస్పర్థలు తలెత్తాయి. కలిసి జీవించలేమని తేల్చుకున్న ఈ జంట చట్టబద్ధంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే కోర్టుకు వెళ్లారు. ఈ కేసు విచారణ సందర్భంగా భార్య తరఫు న్యాయవాదులు కోర్టులో ఒక వింత వాదనను వినిపించారు. భర్త నుంచి విడిపోయిన తర్వాత ఒంటరిగా విలాసవంతమైన జీవనం సాగించడానికి భార్యకు తన స్వంత జీతం (రూ.1.41 లక్షలు) సరిపోదని పేర్కొన్నారు. వివాహమైన ఈ ఆరు నెలల కాలంలో భర్త ఇంట్లో తాను ఎలాంటి ఉన్నతమైన, విలాసవంతమైన జీవన శైలిని అనుభవించిందో.. విడాకులు తీసుకున్న తర్వాత కూడా అదే స్థాయి జీవితాన్ని కొనసాగించే చట్టబద్ధమైన హక్కు భార్యకు ఉంటుందని వాదించారు. ఈ వింత వాదనతో ఏకీభవించిన కుటుంబ న్యాయస్థానం.. భర్త సంపాదిస్తున్న నెలసరి జీతంలో దాదాపు సగం మొత్తాన్ని, అంటే రూ.1.35 లక్షలను భార్యకు తాత్కాలిక భరణంగా చెల్లించాలని సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.పన్ను మినహాయింపు లేదు.. భర్తకు డబుల్ భారం!ఈ తీర్పులో భర్తను మరింత కోలుకోలేని దెబ్బతీసే మరో అంశం కూడా ఉంది. కోర్టు నిబంధనల ప్రకారం.. భర్త భార్యకు చెల్లించే ఈ భరణం మొత్తం ఆమె వ్యక్తిగత ఖర్చుల పరిధిలోకి వస్తుంది. దీనివల్ల భర్తకు ఆదాయ పన్ను చట్టాల నుంచి ఎలాంటి మినహాయింపు లభించదు. అంటే అతడు తన చేతికి వచ్చే రూ.2.79 లక్షల పూర్తి జీతానికి ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిందే. అలా పన్ను కట్టిన తర్వాత మిగిలే సొమ్ము నుంచి రూ.1.35 లక్షలను భార్య చేతిలో పెట్టాలి. ఆపై మిగిలిన అరకొర సొమ్ముతోనే అతడు తన సొంత ఖర్చులను, తన తల్లిదండ్రుల పోషణను చూసుకోవాల్సి ఉంటుంది.ఈ తీర్పు వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. లక్షకు పైగా సంపాదిస్తున్న మహిళకు కూడా భర్త సంపాదనలో సగం కట్టబెట్టడం ఏ రకమైన న్యాయమని, ఇలాంటి తీర్పులు పురుషుల పాలిట శాపాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.