నైట్ క్లబ్‌లో రచ్చ రచ్చ చేసిన బెన్ స్టోక్స్.. ఇంగ్లండ్ బోర్డు సీరియస్, రిటైర్మెంట్ ఇస్తాడంటూ వార్తలు?

Wait 5 sec.

ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఒకే ఒక్క ఇన్సిడెంట్‌తో ఇప్పుడు తన టెస్టు కెప్టెన్సీనే కాకుండా కెరీర్ కూడా ముగిసిపోయే ప్రమాదంలో పడింది. నైట్ క్లబ్ ఇన్సిడెంట్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే ఆలోచనలో స్టోక్స్ ఉన్నారనే వార్తల నేపథ్యంలో.. తన సలహాదారుడితో కూడా స్టోక్స్ భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా స్టోక్స్‌కు నిర్ణయం తీసుకునేందుకు సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు అనంతరం స్టోక్స్‌తో పాటు ఇంగ్లండ్ పేస్ బౌలర్ గస్ అట్కిన్సన్ జట్టు నిబంధనలు ఉల్లంఘించి, నైట్ క్లబ్‌లో రగ్బీ ఆటగాడు టోటోవా ఔవాతో ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇంగ్లండ్ సెక్యూరిటీ సిబ్బందికి కూడా గాయాలు కావడంతో విషయం పెద్దదయింది. దాంతో ఇంగ్లండ్ జట్టు క్రమశిక్షణ, నిర్వహణ వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తాయి. గతంలో యాషెస్ సిరీస్‌ మధ్యలోనూ ఆస్ట్రేలియాపై వరుస ఓటముల తర్వాత బీచ్‌‌లో మద్యం సేవించి ఇంగ్లండ్ జట్టు వార్తల్లోకి ఎక్కింది. అయితే, ఈ సారి నైట్ క్లబ్‌లో ఇంగ్లండ్ రగ్బీ ఆటగాడితో గొడవ పెద్ద వివాదంగా మారడంతో స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దాంతో స్టోక్స్ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది. యాషెస్ సిరీస్ ఓటమి తర్వాత స్టోక్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్ బోర్డు 2027 వరకు అతన్నే కెప్టెన్‌గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో రెండో టెస్టు మొదలయ్యే ముందే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్టోక్స్, గస్ అట్కిన్సన్‌పై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జూన్ 17 నుంచి ది ఓవల్ వేదికగా ఇంగ్లండ్ - న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. బెన్ స్టోక్స్ మాత్రం తన సలహాదారునితో సమావేశం తర్వాతే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. కెప్టెన్‌గా కొనసాగాలా? తప్పుకోవాలా? లేక కొంతకాలం విరామం తీసుకోవాలా? పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించాలా? అనే అంశాలపై స్టోక్స్ పునరాలోచన చేసుకోనున్నాడు.