హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తున్న వేళ నగరవాసులను ఓ పెను ముప్పు ముంచెత్తబోతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో అడుగుంటుతున్నాయని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డైనమిక్ గ్రౌండ్ వాటర్ రీసోర్స్ అసెస్‌మెంట్ రిపోర్ట్ 2025 స్పష్టం చేసింది. దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి, తెలంగాణ రాష్ట్ర జనాభాలో దాదాపు మూడో వంతు మందికి ఆశ్రయమిస్తున్న హైదరాబాద్ నగరంలో రాష్ట్ర మొత్తం భూగర్భ జల వనరుల్లో కేవలం 3 శాతం మాత్రమే లభ్యత ఉండటం గమనార్హం. జనాభా సాంద్రతకు, నీటి లభ్యతకు మధ్య ఉన్న ఈ తేడా నగర జీవనాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది.కేంద్ర నివేదిక ప్రకారం.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి సగటున 19.8 లక్షల హెక్టార్ మీటర్ల మేర భూగర్భ జల వనరులు ఉన్నాయి. అయితే.. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోకి వచ్చే గ్రేటర్ హైదరాబాద్ రీజియన్‌కు మాత్రం కేవలం 66 వేల హెక్టార్ మీటర్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. రాష్ట్రంలోని 33 జిల్లాల సగటును పరిశీలిస్తే.. ప్రతి జిల్లాకు దాదాపు 63 వేల హెక్టార్ మీటర్ల భూగర్భ జలాలు లభిస్తున్నాయి. జనాభా పరంగా ఎంతో చిన్నవైన ఆసిఫాబాద్, సిద్దిపేట, నాగర్‌కర్నూల్ వంటి జిల్లాలు కూడా గ్రేటర్ హైదరాబాద్ మొత్తం వనరులతో సమానమైన భూగర్భ జల సంపదను కలిగి ఉండటం, రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య ఉన్న తీవ్ర వ్యత్యాసాన్ని బహిర్గతం చేస్తోంది. ఆందోళనకరమైన అంశం ఏంటంటే.. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏడాదికి లభించే భూగర్భ జలం కేవలం 6,100 హెక్టార్ మీటర్లు మాత్రమే కాగా.. 40 లక్షలకు పైగా ఉన్న నగర జనాభా తమ గృహ, వాణిజ్య అవసరాల కోసం 2025 సంవత్సరంలోనే అందులోని దాదాపు 99 శాతం నీటిని పూర్తిగా తోడేశారు. దీనివల్ల భూగర్భ జలాలు సహజసిద్ధంగా రీఛార్జ్ అవ్వడానికి అసలు అవకాశమే లేకుండా పోయింది. ఇదే విధమైన ధోరణి పక్కనే ఉన్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోనూ కనిపిస్తోంది. అక్కడ లభ్యమయ్యే 9700 హెక్టార్ మీటర్ల జలాల్లో ఇప్పటికే 7700 హెక్టార్ మీటర్ల నీటిని తోడేయడంతో ఆ ప్రాంతం కూడా ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది.మహానగరం కాంక్రీట్ జంగిల్ పెరిగిపోవడం, వర్షపు నీటి సంరక్షణ మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఈ దుస్థితికి ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేవలం 15 శాతం విస్తీర్ణంలో మాత్రమే పనితీరు బాగున్న రైన్ వాటర్ హార్వెస్టింగ్, భూగర్భ జల రీఛార్జ్ వ్యవస్థలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నగరంలో అత్యధిక శాతం భూమి కాంక్రీట్, రోడ్లతో నిండిపోవడం వల్ల వర్షం పడినా నీరు భూమిలోకి ఇంకే మార్గం లేకుండా పోయిందని చెబుతున్నారు. దీనికి తోడు హైదరాబాద్‌లోని రాతి భూగర్భ పొరలు, తగ్గిపోతున్న ఖాళీ స్థలాలు సహజ రీఛార్జ్ ప్రక్రియను పూర్తిగా దెబ్బతీశాయని జేఎన్‌టీయూహెచ్ వాటర్ రీసోర్సెస్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ బి. వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నగరవాసులు, ప్రభుత్వం అప్రమత్తమై ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టకపోతే భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి తప్పదని ఆయన హెచ్చరించారు.