కాకినాడ జిల్లా తుని మండలంలో చిన్నారి ఏపీ డిప్యూటీ సీఎం ఆరా తీశారు. కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఆచూకీ కనిపెట్టేందుకు చేపట్టిన చర్యలపై చర్చించారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరితగతిన కనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని సూచించారు. ప్రస్తుతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్న పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలను కూడా వినిగియోగించుకోవాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. దట్టమైన అడవుల్లోకి సైతం వెళ్లగలిగే అటవీశాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్ , నిపుణుల సహాయం తీసుకోవాలని స్పష్టం చేశారు. చిన్నారి ఆచూకీని త్వరగా గుర్తించేందుకు పరిసర అటవీ ప్రాంతాల్లోనూ జల్లెడ పట్టాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. అలాగే ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చించారు. పవన్ కళ్యాణ్‌తో సమీక్ష సందర్భంగా జ్ఞానేశ్వరి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలలో 400 మందికిపైగా సిబ్బంది పాల్గొంటున్నట్టు ఎస్పీ వివరించారు. అత్యాధునిక డ్రోన్లతో అణువణువు జల్లెడ పడుతున్నట్టు పవన్ కళ్యాణ్‌కు తెలియజేశారు. చిన్నారి ఇంటి పరిసరాల్లో 38 సీసీ కెమెరాల్లో ఫుటేజీని పరిశీలించామని ఎస్పీ తెలిపారు. చిన్నారి అదృశ్యమై వారం రోజులు దాటిన నేపథ్యంలో దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మరోవైపు జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో శనివారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో కీలకంగా మారిన గత రెండు రోజులుగా విచిత్రంగా ప్రవర్తించిన కుక్క.. శనివారం కన్నుమూసింది. చిన్నారితో పాటుగా వెళ్లిన పెంపుడు కుక్క.. మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చింది. స్థానికులు, పోలీసుల హడావిడి చూసి మరోసారి అడవిలోకి పారిపోయింది. ఐదు రోజుల తర్వాత మళ్లీ ఇంటికి రాగా.. స్థానికులు బంధించారు. ఈ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి చిన్నారి జాడ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నం కూడా విఫలం కాగా.. శనివారం కుక్క చనిపోవటంతో ఇకపై పోలీసుల దర్యాప్తు ఎలా జరుగుతుందనేదీ ప్రాధాన్యం సంతరించుకుంది.