పశ్చిమాసియాలో యుద్ధంతో దారుణమైన పరిస్థితులు నెలకున్నాయి. సకాలంలో వైద్యం సహాయం అందకపోవడంతో మరో భారతీయుడు ఒమన్ తీరంలో మృతిచెందాడు. అమెరికా దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన విషాదం మరిచిపోక ముందే ఈ ఘటన జరిగింది. ట్యాంకర్ నౌక సెకండ్‌ ఆఫీసర్‌ తమిళనాడుకు చెందిన 35 ఏళ్ల నిశాంత్ ఉర్తనాథన్ మృతిచెందినట్టు ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇటీవల అతడు అనారోగ్యానికి గురైనట్లు పేర్కొంది. ఉద్రిక్తతల కారణంగా దుక్మ్ పోర్ట్ వైఫై కమ్యూనికేషన్లను ఒమన్ నిలిపివేయడంతో మెడికల్ ఎమర్జెన్సీ కోసం విజ్ఞప్తి చేసినా అధికారులు స్పందించలేదని వివరించింది. దీంతో వైద్యం అందక నిషాంత్ పరిస్థితి విషమించి గురువారం మరణించినట్లు వెల్లడించింది.అంతేకాదు, మృతదేహాన్ని భద్రపరచకుండా నౌకలో వదిలివేయడంతో.. కుళ్లిపోయే స్థితికి చేరుకుందని సీమెన్స్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘నెలల తరబడి నావికులు సముద్రంలో ఉంటూ ప్రపంచ వాణిజ్యాన్ని ముందుకు నడిపిస్తున్నారు.. కానీ వారి భద్రత గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. చివరికి వారి మృతదేహాలను కూడా భద్రపరచడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవవహరిస్తున్నారు.. విదేశీ సముద్ర జలాల్లో చనిపోయిన నావికుల మృతదేహాలను గౌరవంగా స్వదేశానికి తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని అభ్యర్థిస్తున్నాం’ అని వాపోయింది. సాయం కోసం తాము చేసిన నౌక యజమానులు, వారి స్థానిక ఏజెంట్ పట్టించుకోవలని ఆ నౌక కెప్టెన్ ఆరోపించారు. యాజమాన్యం రొమానా షిప్ మేనేజ్‌మెంట్ కో లిమిటెడ్‌పై ఆరోపణలు చేశారు. అధికారులకు, పోర్ట్ కంట్రోల్‌ను పలుమార్లు సంప్రదించినా ఎలాంటి సాయం అందలేదని అన్నారు. ఉర్తనాథన్ మరణానికి దారితీసిన సంఘటనలను వివరిస్తూ ఒక లేఖను కూడా సీమెన్స్ యూనియన్ విడుదల చేసింది. ‘‘జూన్ 8న సెకండ్ ఆఫీసర్‌కు ఆరోగ్యం బాగోలేక నిరంతరం వాంతులు చేసుకున్నారు. ఈ సమాచారాన్ని యాజమాన్యం రొమానా షిప్ మేనేజ్‌మెంట్ కోకు తెలియజేశాం.. VHF ఛానల్ 16 ద్వారా నేవీకి కాల్ చేశారు.. అలాగే అనారోగ్యంతో ఉన్న అతడి వివరాలను యూఎస్ నేవీకి కూడా తెలియజేశారు. పరిస్థితి మరింత విషమించింది, అయినా ఎటువంటి స్పందన రాలేదు.. సహోద్యోగులు ఔషధాలు, ఆహారం ఇస్తున్నప్పటికీ ఉర్తనాథన్ పరిస్థితి విషమించడంతో జూన్ 11న మధ్యాహ్నం 12:00 గంటలకు సమీపంలోని దుక్మ్ పోర్టును సంప్రదించారు’’ అని తెలిపింది.‘‘మేము దుక్మ్ పోర్ట్ కంట్రోల్‌కు ఫోన్ చేసి వైద్య సహాయం అందించమని, అలాగే అతడి తరలించమని అభ్యర్థించాం. దుక్మ్‌లోని స్థానిక ఏజెంట్‌ను సంప్రదించమని చెప్పారు.. మధ్యాహ్నం 2 గంటలకల్లా మాకు దుక్మ్‌లోని ఏజెంట్ వివరాలను ఇచ్చింది, మేము ఆ సమాచారాన్ని వారికి అందించాం.. మధ్యాహ్నం 3 గంటలకల్లా అతడు స్పృహ కోల్పోయాడు’’ అని యూనియన్ ప్రకటనలో పేర్కొంది. అయితే, యాజమాన్యం ఈ ఘటనపై స్పందిస్తూ.. దీనికి మూడు రోజుల ముదే షినాస్ పోర్టుకు వెళ్లాలన్న ఆదేశాలను పాటించడానికి సిబ్బంది నిరాకరించారని ఆరోపించింది. అంతేకాదు, సెకెండ్ ఆఫీసర్‌‌కు పూర్తి సహాయం అందించామని పేర్కొనడం గమనార్హం.