సమాజంలో పరిస్థితులు రోజురోజుకూ ఎంత దారుణంగా తయారవుతున్నాయంటే.. చివరకు బస్సులలోనూ భద్రత కరవయ్యే పరిస్థితులు వస్తున్నాయి. అది నిజమని నిరూపించే ఘటనే ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సులో మత్తుమందు ఇచ్చి.. ప్రయాణికుడి వద్ద ఉన్న బంగారు నగలు కాజేశారు. ఈ నెల రెండో తేదీన ఈ ఘటన జరగ్గా.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితులు చెప్తున్న వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లాలోని మండలంలో ఉన్న ధర్మవరం గ్రామానికి చెందిన హనుమంతరావు అనే వ్యక్తి బ్యాంకులో రుణం తీసుకున్నారు. బంగారు నగలు తాకట్టు పెట్టి బ్యాంకులో అప్పు తీసుకున్నారు. ఆ ఆప్పు చెల్లించేసిన హనుమంతరావు ఆగస్ట్ రెండో తేదీన బ్యాంకులో నుంచి నగలు తీసుకుని ఒంగోలుకు బస్సులో బయల్దేరారు. ఒంగోలు వెళ్లటం కోసం అద్దంకి- ఒంగోలు బస్సు ఎక్కారు.*అయితే బస్సులో వస్తున్న సమయంలో హనుమంతరావుతో పక్కసీట్లోని వ్యక్తి మాటలు కలిపాడు. అలా మాటలలో పెట్టి హనుమంతరావు వద్ద ఉన్న వాటర్ బాటిల్‌లో మత్తుమందు కలిపేశాడు. ఈ విషయం తెలియని హనుమంతరావు.. ఆ నీటిని తాగిన తర్వాత నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారప. దీంతో అపరిచిత వ్యక్తికి మంచి సందు దొరికింది. ఇంకేముంది హనుమంతరావు బ్యాగులో ఉన్న రూ.3.5 లక్షలు విలువ చేసే బంగారు నగలు, సెల్‌ఫోన్ తీసుకుని బస్సు దిగి ఉడాయించాడు. *బస్సు ఒంగోలుకు చేరుకున్న తర్వాత మెలకువలోకి వచ్చిన హనుమంతరావుకు బ్యాగులో ఉండాల్సిన బంగారు నగలు, ఫోన్ కనిపించలేదు. దీంతో తాను మోసపోయిన విషయం అర్థమైంది. ఈ నేపథ్యంలో బస్సులో మత్తుమందు ఇచ్చి నగలు కాజేశారంటూ ఆదివారం ఒంగోలు పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ అపరిచిత వ్యక్తి కోసం గాలిస్తున్నారు. *మరోవైపు అపరిచిత వ్యక్తులు ఇచ్చే తినుబండారాలు, కూల్ డ్రింక్స్ తాగవద్దని పోలీసులు పదే పదే ప్రకటనలు చేస్తుంటారు. అయితే హనుమంతరావును ఏకంగా ఆర్టీసీ బస్సులోనే బురిడీ కొట్టించి నగలు కాజేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మత్తు మందు కలిపిన నీళ్లు తాగిన తర్వాత హనుమంతరావు నిద్రలోకి జారుకోవటంతో.. పక్కనే ఉన్న ప్రయాణికులు కూడా ఆయన నిద్రపోతున్నారనే అనుకుని ఉండొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఒంటరిగా ప్రయాణాలు చేసే సమయంలో అపరిచిత వ్యక్తులను నమ్మకపోవటం మంచిదంటూ అభిప్రాయపడుతున్నారు.