సాధారణంగా ఇద్దరు ప్రభుత్వ అధినేతలు కలుసుకున్నా.. లేక ఒక దేశానికి ఇంకో దేశ అధినేత వెళ్లినా.. అక్కడ ప్రతీ వస్తువు ఏదో ఒక విశిష్ఠతను, ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ప్రభుత్వాలు విడుదల చేసే ఫోటోల్లో కనిపించే చిన్న వస్తువు కూడా.. ఏదో ఒక కచ్చితమైన సందేశాన్ని ఇస్తుంది. ఇక 4 ఏళ్ల తర్వాత డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత్‌లో పర్యటించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చిన సమయంలో కూడా వారి సమావేశంలో ఒక మొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పుతిన్, మోదీల మధ్య జరిగిన కీలక సమావేశంపై ప్రపంచ దృష్టి ఉండగా.. వారిద్దరు షేక్ హ్యాండ్స్ చేసుకుని కూర్చుని ఉన్న సమయంలో.. వారి వెనుక ఉంచిన ఒక ప్రత్యేకమైన మొక్క అందరి దృష్టిని ఆకర్షించింది. మామూలుగా దౌత్యపరమైన చర్చల్లో దాదాపు ఏదీ యాదృచ్ఛికంగా ఉండదు అనేది తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ మొక్క గురించి నెట్టింట తెగ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అసలు అది ఏం మొక్క అంటూ నెటిజన్లు.. ఇంటర్నెట్ మొత్తం తెగ వెతికే పనిలో పడ్డారు. ఇక ఆ ఫోటోలో కనిపిస్తున్న మొక్క పేరు హెలికోనియా. మోదీ, పుతిన్ మాట్లాడుకుంటుండగా.. కెమెరాలు అన్నీ ఆ హెలికోలియా మొక్క పువ్వులు, నిటారుగా ఉండే దాని కాండం, దాని అందంపై ఫోకస్ చేశాయి. ఉన్నత స్థాయి దౌత్యపరమైన చర్చల్లో భాగంగా.. నేతలు సమావేశమయ్యే రూంలో పూలు, రంగులు, కూర్చునే స్థానం వంటి ప్రతీ అంశం ఒక లోతైన అర్థాన్ని తెలియజేస్తుంది. చాలా బలంగా, నిటారుగా ఉండే చెట్టు. అంతేకాకుండా దాని పువ్వులకు ఉండే శక్తివంతమైన రంగు కారణంగా.. ఇది నిశ్శబ్దంగా ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుందని చెబుతారు. ఈ మొక్క పాజిటివ్ ఎనర్జీ, మంచి, డెవలప్‌మెంట్, సమానత్వం, సామరస్యాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా.. ఏదైనా ఒక పని ప్రారంభం, అది ముందుకు సాగే వేగాన్ని కూడా తెలుపుతుంది.అయితే ఈ హెలికోనియా మొక్కను పుతిన్, మోదీ సమావేశంలో ఉద్దేశపూర్వకంగా ఉంచినా.. లేక యాదృచ్ఛికంగా ఉన్నా.. అది ఈ భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశానికి సరిపోయే ఒక పవర్‌ఫుల్ మెసేజ్‌ను అందరికీ పంపించింది. ఇది భారత్ రష్యా చర్చలు కేవలం వ్యూహాత్మకంగానే కాకుండా.. ఆశాజనకంగా ఉన్నాయనే సంకేతాన్ని ఇస్తోంది.