చేయడంలో భాగంగా అయితే దాదాపు 4 ఏళ్లుగా ఉక్రెయిన్‌పై అలుపెరుగని దాడులు చేస్తున్న రష్యాపై.. అమెరికా సహా పశ్చిమ దేశాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. ఇక ఇప్పటికే రష్యాపై అనేక ఆంక్షలు విధించిన నాటో దేశాలు.. మాస్కోను ఆర్థికంగా దెబ్బతీసి దారికి తెచ్చుకోవాలని చేసిన ప్రయత్నాలు అంత సఫలం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా నుంచి తక్కువ ధరకు భారత్ చమురు కొనుగోలు చేయడం.. ఆయుధ సామగ్రిని దిగుమతి చేసుకుంటుండటంతో భారత్‌పైనా అమెరికా సహా వెస్ట్రన్ దేశాలు గుర్రుగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే పుతిన్ భారత పర్యటనపై కొన్ని దేశాలు బహిరంగంగానే అభ్యంతరం తెలపడం తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారంపై స్పందించిన జైశంకర్.. పుతిన్ పర్యటన, రష్యాతో భారత్ బలమైన సంబంధాలపై పశ్చిమ దేశాల మీడియా చేస్తున్న విమర్శలను విదేశాంగ శాఖ మంత్రి తిప్పికొట్టారు. భారత్, రష్యా సత్సంబంధాలు ఇప్పటివి కావని.. ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉన్నాయని వెల్లడించారు. ఇక తమ దేశాల మధ్య ఉన్న మైత్రిని ఇతర దేశాలు కంట్రోల్ చేయడం సరైంది కాదని హితవు పలికారు. గత 70-80 ఏళ్లలో ప్రపంచంలో అనేక భౌగోళిక రాజకీయ ఒడిదొడుకులు ఉన్నప్పటికీ.. భారత్-రష్యా దేశాల మధ్య సంబంధాలు మాత్రం అత్యంత స్థిరమైన, అతిపెద్ద బంధాల్లో ఒకటిగా ఉన్నాయని జైశంకర్ స్పష్టం చేశారు. భారత్ మరొక దేశంతో సంబంధాలు పెట్టుకోవడానికి ఏ దేశానికీ వీటో అధికారం ఉండటం అన్యాయమని జైశంకర్ తేల్చి చెప్పారు. ప్రపంచంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి వీలైనంత ఎక్కువ మంది భాగస్వాములతో సహకారాన్ని కొనసాగించడానికి, ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కాపాడుకోవడానికి భారత్‌కు ఇది చాలా కీలకమని ఆయన వెల్లడించారు. దౌత్యం అంటే ఇతరులను సంతోషపెట్టడం కాదని.. తమ దేశ ప్రయోజనాల కోసం నిలబడటమేనని ఘాటుగా వ్యాఖ్యానించారు.రష్యాతో భారత్‌కు ఉన్న సత్సంబంధాలు అమెరికాతో ఉన్న బంధాన్ని సంక్లిష్టం చేస్తాయా అనే ప్రశ్నకు సమాధానమిచ్చిన జైశంకర్.. అమెరికాతో కమ్యూనికేషన్‌లో భారత్‌ నుంచి ఎలాంటి లోపం లేదని చెప్పారు. ఈ సందర్భంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాతో వాణిజ్యం అనేది భారత్‌కు అత్యంత ముఖ్యమైన అంశమని.. అమెరికా ఆలోచనలో ఇది చాలా కీలకమని పేర్కొన్నారు. ఆమోదయోగ్యమైన నిబంధనలపై.. వాణిజ్య ఒప్పందాన్ని చేరుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందాల విషయంలో కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలు తమకు చాలా ముఖ్యమని జైశంకర్ మరోసారి గుర్తు చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను చూసేటప్పుడు భారత్ వివేకంతో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఇక విదేశాంగ విధానం గురించి వివరించిన జైశంకర్.. అన్ని సమస్యల్లో ప్రతిదీ తమకు అనుకూలంగా ఉండదని.. అడ్డంకులను అధిగమించడానికి నిరంతరం ప్రయత్నించాలని తెలిపారు. భారత్, రష్యా దేశాల వాణిజ్య ప్రయోజనాలకు లాండింగ్ పాయింట్ ఉంటుందని తాము నమ్ముతున్నామని.. దాని కోసం గట్టిగా చర్చలు జరపాల్సి ఉంటుందని జైశంకర్ వెల్లడించారు.