పట్టాల మధ్యలో కారు.. ఎంతకీ తెరుచుకోని రైల్వే గేటు.. కూత వేటు దూరంలో ట్రైన్.. తర్వాత ఏం జరిగిందో తెలుసా..

Wait 5 sec.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కునారం రైల్వే గేటు వద్ద ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన కారులో రైల్వే పట్టాలు దాటుతుండగా.. ఒక్కసారిగా గేటు పడిపోవడంతో కారు పట్టాలపైనే నిలిచిపోయింది. సరిగ్గా అదే సమయంలో.. ఆ మార్గంలో ఒక రైలు దూసుకొస్తుండటం చూసిన అక్కడి ప్రజలు.. కారులో ఉన్న డ్రైవర్ తీవ్ర టెన్షన్‌కు, భయాందోళనలకు గురయ్యారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక రైల్వే గేటు వద్ద భయంభయంగా మారింది. హనుమంతునిపేటకు చెందిన ఒక వ్యక్తి తన కారులో పెద్దపల్లి వైపు వస్తున్నారు. సాధారణంగా కునారం రైల్వే గేటు వద్ద ఒకవైపు గేటు తెరుచుకోవడంతో ఆయన తన కారును పట్టాలపైకి పోనిచ్చారు. కానీ... కారు పట్టాలు పూర్తిగా దాటకముందే, అకస్మాత్తుగా అవతలి వైపు గేటు బలంగా కిందకు పడిపోయింది.రెండు గేట్ల మధ్య, కారు రైలు పట్టాలపైనే పూర్తిగా నిలిచిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా గేటు తెరుచుకోలేదు. అదే సమయంలో. దూరం నుంచి ఒక రైలు వేగంగా వస్తున్న శబ్దం వినిపించింది. ఇది గేటు వద్ద ఉన్న ప్రతి ఒక్కరిలోనూ గుండె వేగాన్ని పెంచింది. కారులో ఉన్న వ్యక్తికి ప్రాణభయం పట్టుకుంది. ఈ అనూహ్య ఘటనతో గేట్‌మ్యాన్ కూడా తత్తరపడిపోయారు. గేటుకు ఏమైందో.. ఎందుకు తెరుచుకోవడం లేదో అర్థం కాలేదు. విషయం తీవ్రతను గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే అత్యవసర సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించారు. వెంటనే స్పందించిన అధికారులు వస్తున్న రైలును ప్రమాద స్థలానికి కొంత దూరంలోనే నిలిపివేయించారు. ఈ నిర్ణయం కారు డ్రైవర్‌కు, గేటు వద్ద నిలిచి ఉన్న ప్రజలకు పెద్ద ఊరట ఇచ్చింది. రైలు ఆగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత.. రైల్వే సిబ్బంది గేటుకు మరమ్మతులు చేయడానికి ప్రయత్నించారు. అయితే.. మరమ్మతులు చేసినప్పటికీ గేటు తెరుచుకోలేదు. గేటు సమస్య పరిష్కారం కాకపోవడంతో, ఆ మార్గంలో రాకపోకలు సాగించాల్సిన పలు రైళ్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. చాలా సమయం తర్వాత పాటు మరమ్మతులు చేయడంతో... ఎట్టకేలకు సమస్య పరిష్కారమై, కారు సురక్షితంగా బయటకు రాగలిగింది.