తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్‌.. ఆ ఆలయానికి త్వరలోనే రైలు సేవలు, SCR జీఎం కీలక ప్రకటన

Wait 5 sec.

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను అందించింది. మనోహరాబాద్- కొత్తపల్లి నూతన బ్రాడ్ గేజ్ లైన్ పూర్తయితే.. కొమురవెల్లి మల్లన్న సన్నిధికి త్వరలో రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ తెలిపారు. ఈ కొత్త రైలు మార్గం ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర జిల్లాలకు, మలన్న భక్తులకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తాయని చెప్పారు. సికింద్రాబాద్- సిద్దిపేట సెక్షన్‌ను జీఎం సంజయ్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా.. మనోహరాబాద్-కొత్తపల్లి మార్గంలో నిర్మిస్తున్న భవనం పనులను ఆయన సమీక్షించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించే లక్ష్యంతో ఈ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టును నిర్ణీత లక్ష్యంలోగా పూర్తి చేయడానికి ముఖ్యంగా కొమురవెల్లి స్టేషన్ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని ఆయన అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు.కొమురవెల్లి దేవస్థానానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా మాత్రమే ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. రైలు సేవలు అందుబాటులోకి వస్తే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తక్కువ ఖర్చుతో, సురక్షితంగా, సులభంగా కొమురవెల్లి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతానికి రోడ్డు మార్గంలో పట్టే సమయం గణనీయంగా తగ్గుతుంది. రైల్వే స్టేషన్ ఏర్పాటుతో కొమురవెల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యాటక రంగం, స్థానిక వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రైల్వే అధికారులు వల్లడించారు. ఇక ఈ సందర్భంగా ట్రాక్‌లు, వంతెనలు, సిగ్నలింగ్ వ్యవస్థల భద్రతా అంశాలను క్షుణ్ణంగా జీఎం సంజయ్ సమీక్షించారు. సిద్దిపేట రైల్వే స్టేషన్‌ను పరిశీలించి ప్రయాణికుల సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. స్టేషన్ మాస్టర్ కార్యాలయం, సర్క్యులేటింగ్ ప్రాంతం, రిలే గది వంటి కీలక విభాగాలను పరిశీలించారు. అంతేకాకుండా, సిద్దిపేట- సిరిసిల్ల మధ్య జరుగుతున్న కొత్త రైల్వే లైన్ పనులను కూడా ఆయన పరిశీలించారు. ఈ విస్తృత తనిఖీలో జోన్, డివిజన్‌కు చెందిన సీనియర్ రైల్వే అధికారులు కూడా ఆయనతో పాటు పాల్గొన్నారు, పనుల నాణ్యత, భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని జీఎం వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కొత్త రైలు మార్గాలు తెలంగాణలోని అంతర్గత ప్రాంతాల కనెక్టివిటీని బలోపేతం చేసి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడతాయన్నారు.