ఏపీలో సినిమా, సీరియల్స్, ఓటీటీ షూటింగ్స్.. ఆ ప్రాంతాల్లో.. పవన్ కళ్యాణ్ సూచనలు..

Wait 5 sec.

గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెంచే విషయంపై దృష్టి సారించారు. అందులో భాగంగా అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేలా అధికారులు పనిచేయాలని.. వారి ఆదాయ మార్గాలు పెంచాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని స్పష్టం చేశారు. అటవీ ఉత్పత్తుల తయారీతో పాటుగా.. వాటికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఎకో టూరిజం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం వంటి కీలకమైన అంశాల ద్వారా గిరిజన యువతలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలని సూచించారు.ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవాలని.. గిరిజనుల శక్తిని, శ్రమను ఉపయోగించుకొని వారి జీవన ప్రమాణాలను పెంచాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రస్తుతం అటవీ ఉత్పత్తులు, ఆర్గానిక్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని.. కాఫీ తోటలతోపాటు అడవిలో విరివిగా దొరికే ఉత్పత్తులను సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. గిరిజనులలో నూతన ఉత్తేజం నింపేలా కొత్త కార్యక్రమాలు చేపట్టాలని.. గిరిజనుల ఆదాయం పెంచడంతో పాటుగా వారికి అన్ని సదుపాయాలు, సౌకర్యాలు అందాలని స్పష్టం చేశారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతం ఉద్యానవన పంటలకు అనువైనదని.. దీనిని అనుసంధానం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ నేపథ్యంలో వివిధ రకాల పనులకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ పంటలతో పాటుగా ఇక్కడి వాతావరణానికి అనువైన పంటలను కూడా పండించేలా చూడాలని ఆదేశించారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. సహజమైన ప్రకృతి సంపదకు నష్టం వాటిల్లకుండా ఎకో టూరిజం పెంచే అవకాశాలపై దృష్టి సారించాలని సూచించారు.వీటితో పాటుగా సినిమాలు, సీరియల్స్, ఓటీటీలో వచ్చే వివిధ రకాల కంటెంట్లను ఏజెన్సీ ప్రాంతాల్లో షూటింగ్ చేసుకునేలా ప్రొత్సహించాలని పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. దీని వల్ల గిరిజనులకు ఆదాయం పెరగడంతో పాటు గిరిజన యువతకు ఉపాధి లభిస్తుందని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ది, వారి జీవన ప్రమాణాల పెంపునకు తీసుకుంటున్న చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. నెలవారీ రిపోర్టులతో ముందుకెళ్దామని పవన్ కళ్యాణ్ అన్నారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు.