తెలంగాణకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇంకా కోలుకోకముందే ఈ తాజా హెచ్చరిక రావడం ఆందోళన కలిగిస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణశాఖ వెల్లడించింది. నేడు (అక్టోబర్ 1) లేదా అక్టోబర్ 2 నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడి, తదుపరి రోజుల్లో అది అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని చెప్పారు. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 4 మధ్య వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. రాష్ట్రంలోని , మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్ రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాకు అలర్ట్ జారీ చేశారు. అల్పపీడనం మరింత బలపడితే హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. నగరంలో లోతట్టు ప్రాంతాలు మరోసారి వరదల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైన విషయం తెలిసిందే. ఇక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (TGDPS) ప్రకారం, ఈ ఏడాది రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో 98.48 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ సగటు (73.11 సెం.మీ.) కన్నా చాలా ఎక్కువ.శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహంఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు 10 గేట్లను 26 అడుగులు ఎత్తి నీటిని దిగువకు నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నాటికి జూరాల ప్రాజెక్టు నుంచి 4,62,448 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 30,736 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 10,300 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. స్పిల్‌వే ద్వారా 5,76,940 క్యూసెక్కులు, ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల నుంచి 64,211 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయంలో నీటిమట్టం 883.10 అడుగులుగా, నీటి నిల్వ 205.2258 టీఎంసీలుగా నమోదైంది.