ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తీపికబురు చెప్పింది. రాష్ట్రానికి కొత్త హైస్పీడ్ కారిడార్ రాబోతోంది. పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పూర్ నుంచి చెన్నై వరకు ఈ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తుంది. సరకు రవాణాకు ప్రాధాన్యత ఇవ్వడమే దీని ముఖ్య ఉద్దేశం. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (MoRTH) దీని మార్గాన్ని ఖరారు చేసే పనిలో ఉంది. ఒక సలహా సంస్థను ఎంపిక చేస్తున్నారు. ఈ సంస్థ హైవే ఎటువైపు, ఎలా వెళ్తే అన్ని విధాలా ప్రయోజనం ఉంటుందో అధ్యయనం చేయనుంది. ప్రస్తుతం కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి-16 (NH-16) మన రాష్ట్రం గుండా వెళ్తోంది. ఈ కొత్త హైవే ఆ రహదారికి సమాంతరంగా నిర్మిస్తారు. కోల్‌కతా-చెన్నై హైవేకి సమాంతరంగా, తీరప్రాంత హైవే (NH-216)కి మరోవైపు కొత్త హైస్పీడ్‌ కారిడార్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ కారిడార్‌ విశాఖపట్నం దగ్గరగా వెళ్లి, విజయవాడ సమీపంలో అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్‌లో కలిసి, గుంటూరు దాటాక మళ్లీ మొదలవుతుంది. దీనిని చెన్నై వరకు కాకుండా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రస్తుత కోల్‌కతా-చెన్నై హైవేలో కలిపే ఆలోచన ఉన్నప్పటికీ.. పూర్తి ప్రయోజనం కోసం చెన్నై వరకు నిర్మించడమే మంచిది అంటున్నారు. ఇది గ్రీన్‌ఫీల్డ్‌, యాక్సెస్‌ కంట్రోల్‌ హైవేగా ఉంటుంది.కొంతకాలంగా కోల్‌కతా-చెన్నై వాహనాల రద్దీ చాలా పెరిగింది. అది పూర్తిగా ఆరు వరుసలు లేకపోవడంతో వేగంగా ప్రయాణించడం కష్టం అవుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా, ఇప్పుడు దానికి సమాంతరంగా కొత్త జాతీయ రహదారిని నిర్మించాలని ప్లాన్ చేశారు. ఈ కొత్త హైవే వాహనదారులకు పెద్ద ఊరటనిస్తుంది. ఇది కొత్త ప్రాంతాలను కలుపుతుంది, వాటి అభివృద్ధికి తోడ్పడుతుంది. ముఖ్యంగా, రాజధాని అమరావతికి ఇది చాలా కీలకం అంటున్నారు. రాజధాని అమరావతి చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నారు. ఈ అవుటర్ రింగ్ రోడ్ ఏడు హైవేలను కలుపుతుంది. అమరావతిలో కొత్త సంస్థలు వస్తున్నాయి, భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతుంది. ఈ హైవే నిర్మాణం రాష్ట్రానికి, అమరావతికి ఎంతో అవసరం అని చాలా కాలంగా ఉన్న డిమాండ్ ఇప్పుడు నెరవేరబోతోంది. ఢిల్లీలోని మోర్త్‌ ఉన్నతాధికారులు హైస్పీడ్‌ కారిడార్‌ ఎలైన్‌మెంట్ల తయారీని పరిశీలిస్తున్నారు. నెల రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తర్వాత తుది ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేస్తారు. ఆ తర్వాత ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుస్తుంది. ఎంత భూమిని సేకరించాలో కూడా అప్పుడే స్పష్టంగా తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నుండి విశాఖపట్నం వరకు 165 కిలోమీటర్ల పొడవైన 6/8 వరుసల కోస్టల్ కారిడార్ ప్రతిపాదన ఇప్పుడు సందిగ్ధంలో పడింది. దీనికి NHAI డీపీఆర్ సిద్ధం చేస్తోంది. సుమారు 8,300 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించాలనుకున్న ఈ ప్రాజెక్టును మొదట MoRTH హైస్పీడ్ కారిడార్‌లో చేర్చాలని భావించారు. అయితే, MoRTH ఇప్పుడు తన కారిడార్‌ను సముద్ర తీరం నుండి దూరంగా, కోల్‌కతా-చెన్నై హైవేకి అవతలి వైపు నుండి నిర్మించాలని చూస్తోంది. దీంతో ఈ కోస్టల్ కారిడార్ భవిష్యత్తు ఏమిటనేది స్పష్టంగా తెలియడం లేదు.