బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం తీరం దాటింది. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో గోపాల్‌పూర్ సమీపంలో తీవ్రవాయుగుండం ఒడిశా తీరాన్ని దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తీవ్రవాయుగుండం ప్రస్తుతం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతోందని.. శుక్రవారం ఉదయానికల్లా క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం ,అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మరోవైపు ఉత్తరాంధ్రలో రేపు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల క్రింద, పాడుబడిన భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని సూచించారు. అత్యవసర సహాయం కోసం ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లు112,1070, 18004250101 సంప్రదించాలని సూచించారు. మరోవైపు వచ్చే 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా. విజయనగరం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఫ్లా్ష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాల్లో స్కూళ్లకు అక్కడి డీఈవో రేపు ( శుక్రవారం) స్కూళ్లకు సెలవు ప్రకటించారు. వర్షం ముప్పు ఉన్న మిగతా జిల్లాల్లోనూ సెలవులు ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. భారీ వర్షాలు.. సీఎం చంద్రబాబు సమీక్షమరోవైపు వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఈదురుగాలులు సంభవిస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని అధికారులనుఆదేశించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని నిర్దేశించారు. కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు సేవలు అందిస్తూ.. ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు బృందాలు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చంద్రబాబు సూచించారు. మంత్రులు, విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితులను పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.మరోవైపు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల భారీ చెట్లు నేలకూలాయి. చెట్లు కరెంట్ తీగలపై పడడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మరికొన్ని చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.