20 ఏళ్లుగా ఆ గ్రామ ఉప సర్పంచే.. సర్పంచ్‌గా బాధ్యతలు.. కారణం ఇదే

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలోని పలు షెడ్యూల్డ్ ఏరియాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు విచిత్రమైన పరిస్థితులను సృష్టిస్తున్నాయి. రిజర్వేషన్లు కేటాయింపులో ఉన్న లోపాల కారణంగా కొన్ని గ్రామాలలో సర్పంచ్ పదవి ఖాళీగా ఉండిపోతోంది, ఫలితంగా ఆయా ప్రాంతాల అభివృద్ధి కుంటుపడుతోంది. ఖమ్మం జిల్లాలో విచిత్ర పరిస్థిత.. ఖమ్మం జిల్లా, ఏన్కూరు మండలం పరిధిలోని నూకలంపాడు గ్రామ పంచాయతీలో ఈ విచిత్రమైన పరిస్థితి దశాబ్దాలుగా కొనసాగుతోంది. మొత్తం 1,063 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామ పంచాయతీని షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించారు. దీని ప్రకారం సర్పంచ్ స్థానంతో పాటు, మొత్తం ఎనిమిది వార్డుల్లో నాలుగు ఎస్టీలకు రిజర్వ్ చేశారు. అయితే, దురదృష్టవశాత్తు నూకలంపాడు పల్లెలో ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేరు. దీని కారణంగా 2004 నుంచి ఇప్పటివరకు సర్పంచ్ పదవితో పాటు ఎస్టీలకు కేటాయించిన నాలుగు వార్డులు ఖాళీగా ఉంటున్నాయి. గత నాలుగు టర్మ్‌ల ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. ఈ క్రమంలో.. ఎన్నికలు జరిగిన జనరల్ వార్డుల్లో గెలిచిన సభ్యులలో ఒకరిని ఉపసర్పంచ్‌గా ఎన్నుకొని, ఆ ఉపసర్పంచ్‌కే సర్పంచ్ అధికారాలు అప్పగిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే పద్ధతి కొనసాగనుంది. అమ్రాబాద్‌లో అధికారి పాలన తప్పదు..నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలంలో కూడా పరిస్థితి ఇందుకు తగిన విధంగానే ఉంది. ఈ మండలంలోని కల్ములోనిపల్లి, ప్రశాంత్‌నగర్, వంగురోనిపల్లి, కుమ్మరోనిపల్లి అనే నాలుగు గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలను ఎస్టీ మహిళలకు రిజర్వ్ చేశారు. ఈ నాలుగు గ్రామాలలోనూ ఎస్టీ కుటుంబాలు లేకపోవడంతో, సర్పంచ్ అభ్యర్థులే కరువయ్యారు. గత ఎన్నికల్లోనూ ఇలాగే జరిగింది, ఫలితంగా ఐదేళ్లపాటు ఈ పల్లెలలో ప్రత్యేకాధికారి పాలనే కొనసాగింది. ఈసారైనా రిజర్వేషన్లు మారుతాయని ఆశించిన గ్రామస్తులకు మళ్లీ నిరాశే ఎదురైంది. గ్రామాల అభివృద్ధికి ఆటంకం..సర్పంచ్ ఎన్నికలు జరగకపోవడం వల్ల ఈ గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధి లేకపోవడంతో ప్రభుత్వ నిధులు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలంలో కూడా ఎన్.వి. బంజర (బీసీ మహిళ), రాములుతండా (బీసీ జనరల్) గ్రామాల్లో బీసీ ఓటర్లు లేకపోవడంతో, అక్కడ కూడా వార్డు సభ్యుల్లో ఒకరిని ఉపసర్పంచ్‌గా నియమించి, సర్పంచ్ బాధ్యతలను అప్పగించనున్నారు. స్థానిక అధికార యంత్రాంగం స్పందించి.. ఆయా ప్రాంతాల్లోని సామాజిక వర్గాల జనాభా ప్రకారం రిజర్వేషన్లను మార్పు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.