మాజీ కెప్టెన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసింది. పాకిస్తాన్ బ్యాటర్ గురించి మాట్లాడుతూ ఆమెను “ఆజాద్ కశ్మీర్”కు చెందిన ప్లేయర్‌గా సనా పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఆసియా కప్‌లో భారత్ - పాక్ మధ్య వివాదం ఎంత దూరం తీసుకెళ్లిందో అందరికీ తెలిసిందే!పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను ఆజాద్ కశ్మీర్ (స్వతంత్ర) కశ్మీర్ అంటూ సనా మిర్ చేసిన వ్యాఖ్యలపై మళ్లీ భారత్ - పాక్ చిచ్చు రేగింది. 29 ఏళ్ల నటాలియా పర్వైజ్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని భింబర్ జిల్లాలోని బండాలా గ్రామానికి చెందింది. అయితే ఆమె ఎక్కువగా లాహోర్‌లోనే క్రికెట్ ఆడుతూ ఎదిగింది. ఈ విషయాన్ని సనా మిర్ వ్యాఖ్యాతగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావించడమే ఇప్పుడు వివాదానికి కారణం. “వాళ్లు (పాకిస్తాన్) ఈ ఏడాది క్వాలిఫయర్స్ గెలిచారు. కానీ చాలా మంది కొత్త ఆటగాళ్లే. నటాలియా కశ్మీర్‌ నుంచి వచ్చింది, ఆజాద్ కశ్మీర్. ఎక్కువగా లాహోర్‌లో ఆడాలి కాబట్టి, అక్కడికే వచ్చి ఆడుతుంది” అని సనా మిర్ మరో వివాదానికి తెరదీసింది. ఇటీవలే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం సంపాదించిన తొలి పాకిస్తాన్ మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందిన సనా మిర్ ఈ వ్యాఖ్యతో మరోసారి వార్తల్లో నిలిచింది. మహిళల వరల్డ్ కప్‌లో అక్టోబర్ 5న జరగనున్న భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు సనా చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి ఇరుదేశాల మధ్య నిప్పురాజేసినట్టయింది. ఇప్పటికే ఆసియా కప్ ట్రోఫీ విషయంలో ఒక చిచ్చు రేగుతున్న సమయంలో.. ఇప్పుడు సనా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల క్రికెట్‌లో మరింత అగ్గి రాజేసినట్టయింది. బీసీసీఐ ఇప్పటికే భారత మహిళల జట్టుకు “హ్యాండ్‌షేక్ చేయవద్దు” అనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో అక్టోబర్ 5న జరిగే మ్యాచ్ మరింత రసవత్తరంగా మారింది.ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ “భారత్ ఆ మ్యాచ్‌ను కొలంబోలో ఆడుతుంది. క్రికెట్ ప్రోటోకాల్‌లో ఉన్నవన్నీ పాటిస్తాం. కానీ హ్యాండ్‌షేక్ లేదా హగ్గింగ్ జరుగుతుందా అనే విషయంలో ఇప్పుడే హామీ ఇవ్వలేను. మేము ఎంసీసీ నియమాలను మాత్రమే పాటిస్తాం” అని తెలిపాడు.పురుషుల ఆసియా కప్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ సహా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో హ్యాండ్‌షేక్‌కు దూరంగా ఉన్నారు. అంతేగాక, ఫైనల్‌లో గెలిచిన ట్రోఫీని పాకిస్తాన్ మంత్రి మోహ్సిన్ నక్వీ చేతుల నుంచి స్వీకరించడాన్నికూడా భారత జట్టు నిరాకరించింది. మొత్తానికి సనా మిర్ చేసిన ఆజాద్ కశ్మీర్ వ్యాఖ్యతో మహిళల వరల్డ్ కప్‌లో రాజకీయ వివాదం ముసురుకుంది. దాంతో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌ ఎలా జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.