కాంతార.. ఫస్టాఫ్ స్లోరా.. క్లైమాక్స్ తనివితీరా!

Wait 5 sec.

మూడేళ్ల క్రితం అనుకుంట.. ఏదో ఖాళీ దొరికిందని ఫ్రెండ్స్‌తో పాటు ఓ కన్నడ డబ్బింగ్ సినిమాకి వెళ్లా. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లో అడుగుపెట్టిన నాకు ఆ సినిమా ఇచ్చిన స్ట్రోక్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆ హీరో యాక్టింగ్.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. స్క్రీన్ ప్రజెన్స్.. అబ్బో అది మాటల్లో చెప్పేది కాదు తనివితీరా చూస్తేనే తెలుస్తుంది.. ఆ సినిమా పేరే 'కాంతార'. మళ్లీ మూడేళ్ల తర్వాత ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్‌గా 'కాంతార చాప్టర్ 1'ని తెరకెక్కించారు రిషబ్ శెట్టి. ఈసారి అసలు కాంతార అంటే ఏంటి? దాని వెనుక ఉన్న కథేంటి? అసలు ఆ ప్రాంతంలో ఏం జరిగింది? శివ గణాలుగా చెప్పే గుళిగ సహ మిగిలిన దేవతలు ఎవరు..? అంటూ చాలా డిటైల్‌గా కాంతార చాప్టర్ 1లో రిషబ్ చూపించారు. మరి భారీ బడ్జెట్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చిన కాంతార చాప్టర్ 1.. ఆ కాంతారని గుర్తుంచేసిందా? ఆ స్థాయిని అందుకుందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కాంతార కథమా నాన్న ఇక్కడే మాయమయ్యాడు.. అసలు ఇక్కడేముంది అంటూ హీరో అడిగే ప్రశ్నతో కాంతార సినిమా ఎండ్ అవుతుంది. ఇక కాంతార చాప్టర్ 1 అదే ప్రశ్నతో మొదలవుతుంది. ఆ కుర్రాడికి ఓ పెద్దాయన చెప్పిన కాంతార కథే ఈ సినిమా. "ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో.. అప్పుడు ధర్మాన్ని కాపాడటానికి ఆ ఈశ్వరుడు తన గణాల్ని పంపుతూనే ఉంటాడు. ఈ గణాలన్నీ వచ్చి కొలువైంది ఈ పుణ్యభూమిలోనే" అంటూ దట్టమైన అడవిలో ఉన్న కాంతార రహస్యాలు చెబుతూ సినిమా మొదలవుతుంది.సాక్షాత్ పరమేశ్వరుడు కాంతారలో వెలిశాడని.. తన భర్త ధ్యానం చేసుకునేందుకు అక్కడే పార్వతి దేవి 'శివుని పూతోట' అంటూ ఓ ప్రాంతాన్ని సృష్టించిందంటూ అక్కడి ప్రజలు నమ్ముతారు. అయితే అక్కడ కాంతారవాసులకి ఒకరోజు నీటిలో ఒక రాయి (శివలింగం ఆకారంలో) దొరుకుతుంది. దీంతో దాన్నే దేవుడిగా భావించి ఆరాధించుకుంటారు. అయితే అప్పటికే చుట్టూ ఉన్న రాజ్యాలన్నీ గెలుచుకొని బాంగ్రా మహారాజు మహాగర్వంతో విర్రవీగుతూ ఉంటాడు.ఒక రోజు అనుకోకుండా అడవిలో ఉన్న కాంతారకి వచ్చిన బాంగ్రా మహారాజుని ఓ అదృశ్య శక్తి చంపేస్తుంది. ఆ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకొని తన రాజ్యానికి చేరుకుంటాడు మహారాజు కొడుకు (జయరామ్). కానీ తన కళ్ల ముందే తన నాన్నని చంపేసిన ఆ శక్తిని తలచుకొని ప్రతిరోజూ భయపడుతూనే ఉంటాడు. తనకి పుట్టిన ఇద్దరి పిల్లలకి రోజూ కాంతార గురించి కథలు కథలుగా చెబుతుంటాడు. ఏమైనా సరే కాంతారకి మాత్రం వెళ్లొద్దు.. అక్కడ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడని చెబుతుంటాడు.కొన్నాళ్లకి తన కొడుకు కులశేఖర (గుల్షన్ దేవయ్య)కి మహారాజ పట్టాభిషేకం చేసి మురిసిపోతాడు రాజు. కానీ కులశేఖరకి లేని అలవాటు ఉండదు. చిన్నప్పటి నుంచి కాంతార గురించి తన నాన్న చెప్పినవన్నీ కట్టుకథలే అంటూ తన స్నేహితుల్ని, భటుల్ని తీసుకొని కాంతారకి వేటకి వెళ్తాడు. హద్దులు దాటి తమ ప్రదేశానికి వచ్చిన వీళ్లని కాంతార వాసులు తరిమికొడతారు. కొన్నేళ్ల క్రితం కాంతార వాసులకి అక్కడే ఉన్న ఒక లోయలో పులి పక్కనే ఓ పసిబిడ్డ దొరుకుతాడు. వాడికి బర్మే (రిషబ్ శెట్టి) అని పేరు పెట్టి పెంచుతారు. కాంతారకి తనే నాయుకుడు అవుతాడు.ఇక తమ ప్రదేశానికి వచ్చిన బాంగ్రా రాజుకి సరైన గుణపాఠం చెప్పాలని బర్మే తన స్నేహితులతో కలిసి బాంగ్రా రాజ్యానికి వెళ్తాడు. అక్కడ ఓ ప్రమాదం నుంచి యువరాణి కనకావతి (రుక్మిణి వసంత్)‌ని కాపాడతాడు. తర్వాత ఆమె బర్మేపై మనసు పారేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న రాజు కులశేఖర మొత్తం కాంతారనే తగలబెట్టేస్తాడు. మరి అప్పుడు ఏం జరిగింది? కాంతారని ఎవరు కాపాడారు? అసలు బర్మే ఎవరు? బాంగ్రా రాజ్యంతో కాంతార ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది? అసలు కనకావతి ఎవరు అనేదే మిగిలిన కథ. నిలబెట్టిన ఆ రెండూఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు ఏం చేసినా, ఏం చూపించినా అది కొంచెం బావున్నా ఆడియన్స్‌కి మంచి హై ఇస్తుంది. కానీ అదే చూసేవారిలో ముందే అంచనాలు ఉంటే వాటిని అందుకోవడానికి ఏం చేసినా తక్కువే అనిపిస్తుంది. కాంతార చాప్టర్ 1 విషయంలో రిషబ్ శెట్టికి ఇదే పరిస్థితి వచ్చింది. కాంతారతో వచ్చిన సక్సెస్‌ని, అంచనాల్ని అందుకోవాలని రిషబ్ శెట్టి చాలా ప్రయత్నించారు.అందుకే భారీ బడ్జెట్, హై స్కేల్, యాక్షన్ సీక్వెన్స్‌లు, రిచ్‌నెస్ ఇలా అన్నీ కలిసి హై క్లాస్ కాంతారని చూపించే ప్రయత్నం చేశారు. అయితే కాంతార చూసినప్పుడు కలిగిన ఆ ఫ్రెష్ ఫీలింగ్.. ఇందులో కాస్త మిస్ అవుతుంది. ముఖ్యంగా ఫస్టాప్ చూసినప్పుడు అసలు రిషబ్ మళ్లీ కాంతారని టచ్ చేయకుండా ఉండాల్సింది అనే ఫీలింగ్ కలుగుతుంది. అంతా బాగానే ఉన్నా ఎక్కడో ఏదో వెలితి అనిపిస్తుంది.ఎందుకంటే కాంతారలో ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. అందుకే అది చూసినప్పుడు ఒక అద్భుతంలా కనిపించింది. కానీ ఈ ఛాప్టర్ 1కి వచ్చేసరికి బడ్జెట్ పెరిగింది.. ఆ రియల్ ఫీలింగ్ ఎందుకో తగ్గిపోయింది అనే ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సీన్లు అవసరం లేదేమో.. అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఫస్టాఫ్‌లో అటు కాంతార, ఇటు బాంగ్రా ప్రాంతాల్ని చూపించడానికి ఆ సెటప్ బిల్డ్ చేయడానికి రిషబ్ చాలా సమయం తీసుకున్నారు.కానీ కాంతార చాప్టర్ విషయంలో ఆడియన్స్‌ ఫీలింగ్‌ని సెకండ్ హాఫ్ చాలా వరకూ మార్చింది. రిషబ్ శెట్టి సెకండాఫ్ చాలా డీసెంట్‌గా రాసుకున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ మంచి హైతో ముగించి సెకండాఫ్‌పై అంచనాలు క్రియేట్ చేశారు. కాంతార ప్రజలు తమ ఉనికి కోసం, దేవుడి కోసం ఎలాంటి పోరాటం చేశారు అనేది సెకండాఫ్‌లో చాలా బాగా చూపించారు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా తెరకెక్కించారు.హీరో శరీరంలోకి గుళిక (దేవ గణం) వచ్చినప్పుడు పడిన సీన్లు అన్నీ మరోసారి థియేటర్లో ఆడియన్స్‌కి గూస్ బంప్స్ తెప్పించడం పక్కా. ఇక క్లైమాక్స్ ఈ సినిమాకి ప్రాణం అనే చెప్పాలి. సేమ్ కాంతార లానే ఇందులో కూడా అదిరిపోయే క్లైమాక్స్ రాసుకున్నారు రిషబ్. రాసుకోవడమే కాదు దాన్ని అదే రేంజ్‌లో స్క్రీన్‌‌పై తన నటనతో మెప్పించారు. క్లైమాక్స్‌లో.. ప్రీ క్లైమాక్స్‌లో రిషబ్ యాక్టింగ్ పీక్స్‌లో ఉంది. నిజానికి సినిమాని క్లైమాక్స్.. రిషబ్ యాక్టింగ్‌గే నిలబెట్టాయి.వీఎఫ్‌ఎక్స్ విషయంలో రిషబ్ శెట్టి తీసుకున్న శ్రద్ధ స్క్రీన్ మీద కనిపించింది. ఎందుకంటే గుళిగ సహా శివగణాలు కనిపించిన ప్రతి సీన్‌లోనూ వీఎఫ్ఎక్స్ వర్క్ టాప్ నాచ్‌లో ఉంది. థియేటర్లో ఆడియన్స్‌కి అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే విధంగా రిషబ్ బాగా ప్లాన్ చేశారు.ఫస్టాఫ్‌లో క్యూట్.. సెకండాఫ్‌లో అమ్మోఇక రిషబ్ తర్వాత సినిమాలో అంతలా మెప్పించింది మాత్రం రుక్మిణి వసంత్‌యే. ఫస్టాఫ్‌లో రుక్మిణి అందాలు, ప్రజెన్స్ అన్నీ ఆడియన్స్‌ని కట్టిపడేస్తాయి. అయితే ఫస్టాఫ్‌లో ఎంత క్యూట్‌గా కనిపించిందో సెకండాఫ్‌లో ఆమె క్యారెక్టర్‌లో వచ్చే సర్‌ప్రైజ్ ఆడియన్స్‌కి పెద్ద సర్‌ప్రైజ్‌యే ఇస్తుంది. యుద్ధ సన్నివేశాలు, ప్రేమ కలాపాలు ఇలా ప్రతి చోటా రుక్మిణి భలే ఉంది.గుల్షన్ దేవయ్య క్యారెక్టర్ కాస్త వెరైటీగా ఉంది. జయరామ్ కూడా తన పాత్రలో మెప్పించారు. అజినీష్ లోక్‌నాథ్ మరోసారి తన మ్యూజిక్ తో సినిమాని నిలబెట్టారు. ఓవరాల్‌గా కాంతారలో నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి సూపర్ హిట్ అయ్యారు. కానీ ఈ చాప్టర్ 1 విషయానికొస్తే ఫస్ట్ పార్ట్ రేంజ్‌లో డైరెక్టర్‌గా ఆయన మెప్పించలేదేమో అనిపించింది. కానీ యాక్టర్‌గా మాత్రం మరోసారి ఇరగదీశారు. అలా అని ఇది బాలేదా అంటే బావుంది.. కానీ ఎక్కడో ఆ ఫ్రెష్ ఫీల్ మిస్ అయింది. ఓవరాల్‌గా కాంతార చాప్టర్ 1.. అంచనాలు లేకుండా వెళ్తే ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు..!