ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం సక్రమంగా అమలు కాకపోవడం తీవ్ర ఇబ్బందులను సృష్టిస్తోంది. ఈ పథకం ఆరంభంలో లక్షలాది మందికి లబ్ధి చేకూరినప్పటికీ.. నిబంధనల్లోని చిక్కులు, కటాఫ్ తేదీ కారణంగా ఏటా అర్హుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ముఖ్యంగా కరీంనగర్ వంటి వ్యవసాయ ఆధారిత జిల్లాలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. పీఎం కిసాన్ నిబంధనలతో ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన ఈ పీఎం కిసాన్ పథకం కింద.. అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ. 6,000 చొప్పున మూడు విడతల్లో రూ. 2,000 వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. అయితే.. అనేక మంది రైతులు ఈ సాయాన్ని పొందలేకపోతున్నారు. కరీంనగర్ రైతులపై కటాఫ్ తేదీ ప్రభావం.. ఈ పథకం అమలులో అతిపెద్ద అడ్డంకి 2019 జనవరి 31 కటాఫ్ తేదీ. ఈ తేదీ తర్వాత భూమిని కొనుగోలు చేసిన లేదా వారసత్వంగా పొందిన రైతులకు ఈ పథకం వర్తించడం లేదు. కేవలం అసలు పట్టాదారు మరణించి.. వారి వారసులు 'విరాసత్' ద్వారా భూమిని పొంది దరఖాస్తు చేసుకుంటే తప్ప, కొత్త రైతులకు అవకాశం దక్కడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2019 తర్వాత భూములు పొందిన లక్షలాది మంది కొత్త రైతులు ఈ పథకం ప్రయోజనం కోల్పోతున్నారు. దీని ఫలితంగా జిల్లాలో ప్రారంభంలో లబ్ధి పొందిన రైతుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఉదాహరణకు.. కరీంనగర్ జిల్లాలోని 16 మండలాల్లో మొదటి విడతలో 1,13,794 మంది రైతులు నమోదు చేసుకోగా, ప్రస్తుతం కేవలం 60,558 మందికి మాత్రమే సాయం అందుతోంది. అంటే, సుమారు 53,236 మంది రైతులు క్రమంగా లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిపోయారు లేదా అనర్హులుగా తేలారు. లబ్ధిదారులు తగ్గడానికి ఇతర కారణాలు.. పీఎం కిసాన్ పథకంలో అర్హత నిబంధనలు కఠినంగా ఉండటం వల్ల కూడా లబ్ధిదారులు తగ్గుతున్నారు. అందులో ముఖ్యంగా.. ప్రభుత్వ ఉద్యోగులు.. రూ. 10,000 కంటే ఎక్కువ పెన్షన్ తీసుకునేవారు అనర్హులు. ఆదాయపు పన్ను (Income Tax) చెల్లించే రైతులు, విదేశాల్లో నివసించేవారు అనర్హులు. ఒకే కుటుంబంలో దంపతులకు వేర్వేరు గ్రామాల్లో భూములున్నా.. ఒకరికే లబ్ధి చేకూరుతుంది. ఈ-కేవైసీ (e-KYC) వంటి నూతన మార్పులను సకాలంలో పూర్తి చేయని వారు కూడా జాబితా నుండి తొలగించడం జరిగింది. ఈ కారణాల కారణంగా చాల ా మంది లబ్ధిదారులు తగ్గుతున్నారు. విశిష్ట గుర్తింపు కార్డుపై ఆశలు.. ఈ సమస్యల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సహా ఇతర కేంద్ర పథకాల ప్రయోజనాలను రైతులకు అందించేందుకు విశిష్ట గుర్తింపు కార్డు వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. రైతులకు 11 నంబర్లతో కూడిన విశిష్ట సంఖ్యను కేటాయిస్తున్నారు. రైతులు ఈ కార్డు కోసం తమ పేర్లను ఏఈవోల (AEOs) వద్ద నమోదు చేసుకోవాలి. ఈ విశిష్ట సంఖ్య (Unique ID) ద్వారా అయినా, పాత కటాఫ్ తేదీని సడలించి కొత్త రైతులకు అవకాశం కల్పిస్తారని కరీంనగర్ రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.