మేడ, మిద్దె లేని ఊరు.. భక్తా, భయమా?

Wait 5 sec.

ఏడంతస్తుల మేడ.. పాత రోజుల్లో పెద్దరికానికి, శ్రీమంతులకు కేరాఫ్ అడ్రస్.. అందుకే మేడలోని యువరాణి నేలకు వచ్చిందా.. అంటూ సినీ రచయితలు కూడా మేడ విశిష్టతను వేన్నోళ్లా కీర్తించారు. మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదు అంటూ రచనలు చేశారు. ఇక మేడలోని యువరాణికి, పూరి గుడిసెలోని నిరుపేదకు ప్రేమను ముడివేసి ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్క లేదు. రాచరికపు ఠీవికి, సిరిసంపదలకు చిహ్నం మేడ.. మేడ గురించి ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే.. ఎంత మారుమూల పల్లెటూరు అయినా ఎవరో ఒకరు మోతుబరి ఉండకపోరు.. ఆయనకు ఓ మేడ.. ఏడంతస్తులు కాకపోయినా కనీసం రెండంతస్తులు అయినా ఉండకపోదు. ఆ లెక్కన ప్రతీ ఊర్లో మేడ అనేది కామన్ పాయింట్.. కానీ.. జిల్లాలోని ఓ ఊరిలో మాత్రమే మేడ మచ్చుకైనా కానరాదు. అందుకు కూడా పెద్ద కారణమే ఉంది.. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని పెద్దహోతూరు. ఈ ఊరిలో కనీసం వేయికిపైగా ఇళ్లు ఉంటాయి. కానీ ఏ ఇల్లు కూడా రెండంతస్తులు ఉండదు. దానికో పెద్ద చరిత్ర ఉంది. ఊరి దేవుడు హుచ్చువీరప్ప తాత. ఈయనపై గ్రామస్థులకు ఉన్న నమ్మకమే ఇందుకు కారణం. ఈ ఊరి జనం హుచ్చువీరప్ప తాతను ఆరాధ్య దైవంగా భావిస్తారు. సుమారుగా 500 ఏళ్ల కిందట హుచ్చువీరప్ప ఈ ఊరికి వచ్చి స్థిరపడ్డారట. అక్కడే జీవ సమాధి కాగా.. ఆయన జీవన సమాధి అయిన చోటే ఆలయం నిర్మించారు. ఇక అప్పటి నుంచి హుచ్చువీరప్ప తాతను మొక్కుకుంటే కోరిన కోరికలు సిద్ధిస్తాయని స్థానికులు నమ్ముతూ వస్తున్నారు.అయితే హుచ్చువీరప్ప తాత ఆలయ గోపురం రెండు అంతస్తులు వరకూ ఉంటుంది. దీంతో ఆలయ గోపురం ఎత్తును మించి ఊర్లో ఎవరూ ఇల్లు కట్టుకోకూడదని అప్పట్లో గ్రామస్థులు తీర్మానం చేశారట. ఇన్నేళ్లయినా అదే తీర్మానాన్ని, సంప్రదాయాన్ని పెద్దహోతూరు గ్రామ ప్రజల నేటికీ పాటిస్తు్న్నారు. దీంతో ఈ ఊరిలో ఒక్కటి కూడా మేడ కనిపించదు. అలాగే ఆర్థిక స్థోమత ఉన్నా కూడా ఈ ఊరిజనం ఆ నిబంధనను పాటిస్తూ మేడలు నిర్మించడం లేదు. అయితే గతంలో ఓ వ్యక్తి నిబంధనను ఉల్లంఘించి మేడ కట్టేందుకు ప్రయత్నించగా.. అనుకోకుండా చనిపోయారని స్థానికులు చెప్తున్నారు. దీంతో మరొకరు ఆ సాహసం చేయడం లేదు. అయితే హుచ్చువీరప్ప తాత ఆలయం ఆవరణలోని మేడపై మరో నిర్మాణం చేపడితేనే.. ఊర్లో రెండంతస్తుల మేడ నిర్మించుకోవచ్చని స్థానికులు చెప్తున్నమాట. ఈ ఊరికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ఊర్లో ఎక్కువ మంది పేర్లు ఉచ్చీరప్ప, ఉచ్చీరమ్మ, హోతూరప్ప అని ఉంటాయి. గతంలో పిల్లలు అనారోగ్యంతో ఉంటే.. ఈ ఊరికి చెందిన కొంతమంది తల్లిదండ్రులు ఈ ఆలయంలో మొక్కుకున్నారట. దీంతో పిల్లల ఆరోగ్యం మెరుగుపడిందని.. అప్పటి నుంచి హుచ్చు వీరప్పతాత పేరు కలిసేలా పేర్లు పెట్టుకుంటున్నట్లు స్థానికులు చెప్తున్నారు.