మునుగోడు వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో, రేవంత్ సర్కార్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. గత కొంత కాలంగా మంత్రి పదవి కోసం పట్టుపడుతున్న ఆయన.. సీఎం రేవంత్ సహా.. పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తనకు ఎన్నికలకు ముందు మాటతప్పుతున్నారని.. తన నియోజకవర్గానికి నిధులు కూడా విడుదల చేయటం లేదని బహిరంగంగానే ఘాటు వాఖ్యలు చేస్తున్నారు. తాజాగా.. మరోసారి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మునుగోడు నియోజవర్గంలోని ఎలగలగూడెంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవన నిర్మాణ ప్రారంభోత్స కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన అన్న వెంకట్ రెడ్డి మంత్రి పదవి ఉంటే తనకు ఇవ్వకూడదనే రూల్ ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు మాట ఇచ్చే ముందు ఈ విషయం తెలియదా అని నిలదీశారు. 'మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే రాజగోపాల్ రెడ్డికి అన్యాయం జరిగినట్టే. నాకు అన్యాయం జరిగితే ఫర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గత ప్రభుత్వానికి చెప్పినా.. ఇప్పుడు కూడా చెప్తున్నా.. మీరు మాటిచ్చారు. ఇచ్చినప్పుడు ఇవ్వండి కానీ అప్పటివరకు మాత్రం మునుగోడు అభివృద్ధికి సహకరించి ఒక్క రూపాయి కూడా ఆపొద్దు. ఇస్తామన్నమాట ఆలస్యమైంది.. సమీకరణాలు కుదరటం లేదు అంటున్నారు. సమీకరణాలు ఎందుకు కుదరటం లేదు?. ఎవరడ్డుకుంటున్నారు రాకుండా..? నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా? మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా? మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య.. ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా ఉంది. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండడం తప్పా? అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే, ఇద్దరం గట్టి వాళ్లమే ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు.. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. భువనగిరి పార్లమెంటు నుండి ఎంపీగా పని చేశాను.. నల్గొండ జిల్లాకు ఎమ్మెల్సీగా పని చేశాను.. నల్గొండ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలలో మునుగోడు నియోజకవర్గం వెనుకబడి ఉంది. ఆ భగవంతుడు ఏ పదవి ఇచ్చినా.. మునుగోడు ప్రజల కోసమే కానీ నా కోసం కాదు.' అని వ్యాఖ్యనించారు.