: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం డిజిటలైజేషన్‌ను ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కొత్త కొత్త కార్యక్రమాల్ని ప్రారంభిస్తోంది. ఇప్పటికే యూపీఐ సేవల్ని తీసుకొచ్చిన కేంద్రం.. డిజిటల్ పేమెంట్స్‌ను విస్తృతం చేసింది. ఇక ఇందులో భాగంగానే.. భారత ప్రభుత్వం చేపట్టినటువంటి డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తాజాగా మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 6,115 రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు ఇప్పుడు మరింత హైస్పీడ్ వైఫై సౌకర్యం కల్పించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. అహ్మదాబాద్, ముంబై, న్యూ ఢిల్లీ, సికింద్రాబాద్, కాచిగూడ మొదలైన 6115 స్టేషన్లలో ఈ ఫ్రీ వైఫై సేవలు అందుబాటులో ఉన్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రైల్వే సౌకర్యాలపై .. రాజ్యసభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు మంత్రి.. లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాల్ని వెల్లడించారు. >> ఇక ఈ వైఫై సదుపాయంతో ప్రయాణికులు పాటలు, సినిమాలు, గేమ్స్ వంటివి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని.. ఇంకా అత్యవసర సమయాల్లో రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఆఫీసుకు సంబంధించిన వర్క్ కూడా చేసుకోవచ్చని అన్నారు కేంద్ర మంత్రి. రైల్వే శాఖ అనుబంధ సంస్థ రైల్ టెల్ సహకారంతోనే ఈ ఫ్రీ వైఫై సేవల్ని అందిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సదుపాయాలు అందించడంలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.రైల్వే స్టేషన్లలో ఈ ఫ్రీ వైఫై సేవలు ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.>> స్మార్ట్ ఫోన్లలో ముందు మీ వైఫై మోడ్ ఆన్ చేయాల్సి ఉంటుంది.>> అక్కడ కనిపించే నెట్‌వర్క్స్‌లో Railwire WIFI నెట్‌వర్క్ ఎంచుకోవాలి. >> అక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. >> నంబర్ ఎంటర్ చేశాక.. మీ ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. >> ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే.. హై స్పీడ్ వైఫై కనెక్ట్ అవుతుంది.