పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్తాన్.. తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. భారత్‌తో తరచూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి ప్రాంతంలో లైన్ ఆఫ్ కంట్రోల్ (నియంత్రణ రేఖ) సమీపంలో కవ్వింపు చర్యలకు దిగినట్లు భారత సైన్యం ప్రకటించింది. పాకిస్తాన్ బలగాలు.. భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించాయని.. దీంతో వారిని తీవ్రంగా ప్రతిఘటించినట్లు తెలిపింది. దీంతో రెండు దేశాల సైనికుల మధ్య కాల్పులు చోటు చేసుకోగా.. ఈ ఎదురుకాల్పుల్లో ఒక భారత సైనికుడు ప్రాణాలు కోల్పోయినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.ఆగస్టు 12వ తేదీ (మంగళవారం)న పాకిస్తాన్ చొరబాటుదారులు.. భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేశాయని ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే సాధారణంగా జరిగే చొరబాట్ల లాగా కాకుండా.. ఈసారి కొత్తగా ప్రయత్నాలు చేసినట్లు పేర్కొన్నాయి. అయితే భారత్‌లోకి చొరబడేందుకు.. వారికి పాకిస్తాన్ సైన్యం మద్దతు తెలిపిందని భారత సైనిక అధికారులు తెలిపారు. అంతేకాకుండా పాక్ సైన్యం నుంచి చొరబాటుదారులకు కాల్పుల మద్దతు కూడా లభించిందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్స్ అండతోనే ఈ చొరబాటు ప్రయత్నం జరిగిందని ఇండియన్ ఆర్మీ వర్గాలు తేల్చి చెప్పాయి.ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతం అయిన పహల్గామ్‌లో పాక్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చేపట్టిన భారత ప్రభుత్వం.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ ఘటనలో మొత్తం 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్లు భారత్ ప్రకటించింది. అదే సమయంలో పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు భారత్, పాకిస్తాన్ మధ్య అడపాదడపా దాడులు జరుగుతున్నప్పటికీ.. సరిహద్దుల్లో ఈ స్థాయిలో చొరబాటు, కాల్పులు, భారత జవాన్ ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.మరోవైపు.. ఇటీవల అమెరికాలో పర్యటించిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. భారత్‌ పట్ల తన అక్కసు వెళ్లగక్కుతూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తునే ఉన్నారు. పాకిస్తాన్ అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశమని.. తాము నాశనం అవుతున్నామని తెలిస్తే.. అవసరమైతే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ అమెరికా గడ్డపై నుంచే ప్రపంచ దేశాలకు తీవ్ర బెదిరింపులు విసిరాడు. గతంలో అసిమ్ మునీర్ చేసిన రెచ్చగొట్టే ప్రసంగం తర్వాతే పహల్గామ్ ఉగ్ర దాడి జరగడం గమనార్హం. మరోవైపు.. సింధు జలాల విషయంలో కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు రెండు దేశాల మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సరిహద్దుల్లో అలజడి రేగడం గమనార్హం.