హైదరాబాద్‌లో మరో మూడు బస్ డిపోలు.. కొత్తగా ఏర్పాటు, ఈ ప్రాంతాల్లోనే..!

Wait 5 sec.

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని.. (TGSRTC) గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త బస్ డిపోల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. డిసెంబర్ నాటికి మరో మూడు బస్ డిపోలను ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తోంది. ఈ మేరకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో స్థలాలు కేటాయించాలని కోరుతూ ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో 25 బస్ డిపోల నుంచి 3,043 బస్సులు నడుస్తున్నాయి. ఒక్కో డిపోలో సగటున 120-130 బస్సులు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మరో 300కు పైగా కొత్త బస్సులు గ్రేటర్ జోన్‌కు రానున్నాయి. దీంతో బస్సుల సంఖ్య పెరిగి, ప్రస్తుతం ఉన్న డిపోలపై ఒత్తిడి పెరుగుతుంది. హైదరాబాద్ నగరంలో ఉదయం, రాత్రి వేళల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల బస్సులు డిపోలకు చేరుకోవడానికి గంట నుంచి రెండు గంటల సమయం వృథా అవుతోంది. శివారు ప్రాంతాల్లో కొత్త డిపోలను ఏర్పాటు చేస్తే ఈ సమయం ఆదా అవుతుంది. అందుకే నగర శివారు ప్రాంతాల్లో ఈ కొత్త బస్ డిపోలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. జిల్లాల నుంచి నడిచే ఈ కొత్త డిపోల్లో చార్జింగ్ పెట్టుకునే సౌకర్యం లభిస్తుంది. నగర శివారు ప్రాంతాలకు బస్సులను నడిపే వీలు కలుగుతుంది. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఔటర్ రింగ్ రోడ్ (ORR) చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. నగరంలో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ఈ కొత్త డిపోల ముఖ్య లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ డిపోల వల్ల హైదరాబాద్ శివారు ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని అంటున్నారు.మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగి రద్దీ పెరిగింది. ఈ రద్దీని తగ్గించడానికి కొత్త బస్సులు కొనుగోలుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఇప్పటికే 200 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురాగా.. వాటిలో దాదాపు 150 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. 2025 చివరి నాటికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 1,000 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్తులో గ్రేటర్ జోన్‌లో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ బస్సుల వల్ల నిర్వహణ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. ఈ బస్సుల కోసం గ్రేటర్ జోన్‌లోని 25 బస్ డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి.