అవసరం.. అది ఎవరితో.. ఎంత పనైనా చేయిస్తుంది.. బక్కపలచని దేహానికి ఏనుగంత బలమూ ఇవ్వగలదు.. పిరికివాడి గుండెకు ధైర్యాన్ని అందించగలదు.. ఒక్కోసారి ఆకలితో అలమటించే వ్యక్తితో నేరాలు చేయించగలదు.. అంతటి శక్తి అవసరానికి ఉంది.. ఈ క్రమంలోనే అవసరం ప్రాధాన్యాన్ని గుర్తించి పోలీసులు చేపట్టిన వినూత్న ప్రయోగం అందరితో శెభాష్ అనిపిస్తోంది. నిరుపేదల అవసరాలు తీర్చేందుకు ఏలూరు పోలీసులు ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అవసరమైనది తీసుకోండి, అవసరం లేనిది పెట్టండి.. అంటూ కైండ్‌నెస్ వాల్ పేరుతో ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర నుంచి పుస్తకాలు, బొమ్మల వరకూ ఒకరి ఇళ్లల్లో వాడని వస్తువులు.. మరొకరికి ఉపయోగపడే విధంగా కైండ్‍నెస్ వాల్ పేరుతో ఏలూరు పోలీసులు ఈ అవకాశం కల్పిస్తున్నారు. *సాధారణంగా మన అందరి ఇళ్లల్లోనూ వాడని వస్తువులు అనేక ఉంటాయి. కొత్తవి వచ్చిన తర్వాత పాతవి చేదైనట్లు.. ఏవైనా కొత్త వస్తువులు కొంటే పాతవి మూలన పెట్టేయడం అలవాటే. అయితే అలా మూలన పెట్టకుండా అవే వస్తువులను అవసరం ఉన్నవారికి అందిస్తే.. వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ఆలోచనతోనే ఏలూరు పోలీసులు ఈ కైండ్‌నెస్ వాల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ఏలూరు పోలీస్ స్కూల్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆధ్వర్యంలో ప్రత్యేక అల్మారాను ఏర్పాటు చేశారు. కైండ్‌నెస్ వాల్ పేరుతో ఈ అల్మారాను ఏర్పాటు చేశారు.* దీని ప్రత్యేకత ఏమిటంటే.. మన ఇంట్లో, మనం ఉపయోగించని వస్తువులు. దుస్తులు, బొమ్మలు ఏవైనా కానీ.. ఈ అల్మారాలో ఉంచవచ్చు. అలాగే అప్పటికే అల్మారాలో ఉన్న వస్తువులలో మనకు పనికొచ్చేది ఏమైనా ఉంటే ఉచితంగా ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఇదీ దీని ప్రత్యేకత. ఈ కైండ్‌నెస్ వాల్ కార్యక్రమంపై ప్రశంసలు వస్తున్నాయి. మరోవైపు రేపటి తరానికి ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పించడం కోసం ఏలూరు పోలీసులు ఇటీవలే ట్రాఫిక్ పార్కు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ఏర్పాటు చేశారు. దీని ద్వారా విద్యార్థులు ఆడుతూ పాడుతూ ట్రాఫిక్ రూల్స్, రహదారి భద్రతపై అవగాహన పెంచుకునేలా ఏర్పాట్లు చేశారు. 84 లక్షలు ఖర్చుచేసి.. ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఏలూరు పోలీసులు ఈ చిల్డ్రన్ ట్రాఫిక్ పార్కు ఏర్పాటు చేశారు. తాజాగా ఈ కైండ్‌నెస్ వాల్ కార్యక్రమం ప్రారంభించారు.