తిరుమల శ్రీవారికి బెంగళూరు భక్తుడి భారీ విరాళం.. పెద్ద మనసుతో, భక్తులకు ఉచితంగా

Wait 5 sec.

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. ఆ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని కానుకలు సమర్పిస్తారు. కి భక్తులు వివిధ రూపాల్లో కానుకలు, విరాళాలు అందిస్తారు.. ఆలయంలో హుండీలలో బంగారం, వెండి, విలువైన వస్తువులు వేస్తారు. కొందరు భక్తులు మాత్రం తిరుమల శ్రీవారికి బంగారు ఆభరణాలు, టీటీడీ ట్రస్టులకు విరాళాలను అందిస్తుంటారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు కూడా ఇలా విరాళాలు ఇచ్చినవారిలో ఉన్నారు. గత వారం రోజులుగా తిరుమల శ్రీవారికి భారీగా విరాళాలు అందుతున్నాయి. తాజాగా మరో భక్తుడు భారీ విరాళాన్ని అందించారు.టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు బెంగుళూరుకు చెందిన శ్రీ కల్యాణ్ రామన్ కృష్ణమూర్తి అనే భక్తుడు బుధవారం రూ.కోటి విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. దాతను అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి అభినందించారు.. భక్తులకు ఉచితంగా ప్రసాదం అందించే శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం ఇవ్వడం గొప్ప విషయం అన్నారు.'తిరుమలలోని ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనుల పురోగతిపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మంగళవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్ పనులు, మ్యూజియం గైడ్స్, భద్రత, పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్ది ప్రపంచ స్థాయి ఆధునిక మ్యూజియంగా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్ ఛార్జ్ చీఫ్ మ్యూజియం ఆఫీసర్ సోమన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు' అని టీటీడీ తెలిపింది. 'తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్ట్ టాగ్ తప్పనిసరి.. ఈ నూతన విధానం ఆగస్టు 15 నుండి విధిగా అమలు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించే దృష్ట్యా ఆగస్టు 15వ తారీకు నుండి తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్ట్ టాగ్ తప్పనిసరి చేయడం జరిగింది. ఇకపై ఫాస్ట్ టాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించడం జరగదు. ఫాస్ట్ టాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసిఐసిఐ బ్యాంకు వారి సహకారంతో ఫాస్ట్ టాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఫాస్ట్ టాగ్ లేని వాహనదారులు ఇక్కడ అతి తక్కువ సమయంలో ఫాస్ట్ టాగ్ సౌకర్యాన్ని పొందిన తరువాత మాత్రమే వారి వాహనాలను తిరుమలకు అనుమతిస్తారని మరొకసారి తెలియజేయడమైనది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది' అని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు.