కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు నెలవైన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కొంతమంది మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకుంటే.. మరికొంతమంది భక్తులు ప్రజా రవాణా వ్యవస్థ లేదా సొంత వాహనాలతో తిరుమలకు వస్తుంటారు. అయితే సొంత వాహనాలలో తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి దేవస్థానం ముఖ్య గమనిక జారీ చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం కొండపైకి సొంత వాహనాలలో వచ్చే భక్తులు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని సూచించింది. అదేంటంటే శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తుల వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేశారు. ఆగస్ట్ 15వ తేదీ నుంచి తిరుమలకు వచ్చే భక్తుల వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసినట్లు టీటీడీ ప్రకటించింది. సొంత వాహనాలలో తిరుమలకు వెళ్లే భక్తులు అలిపిరి చెక్ పోస్టు వద్ద చెకింగ్ అనంతరం కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రత్యేక పర్వదినాలు, విశేష ఉత్సవాల సమయంలో తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతుంది. దీంతో అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద వాహనాల బారులు తీరుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వివిధ వాహనాలలో అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు వచ్చే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు కల్పించడంతో పాటుగా అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవల కోసం 15 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసినట్లు టీటీడీ తెలిపింది. అలాగే నుంచి ఫాస్టాగ్‌ లేని వాహనాలను తిరుమల కొండ మీదకు అనుమతించబోమని స్పష్టం చేశింది. వాహనదారులు, భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసీసీఐ సహకారంతో ఫాస్టాగ్‌ జారీ కేంద్రాన్ని టీటీడీ ఏర్పాటు చేసింది. ఫాస్టాగ్‌ లేని వాహనదారులు అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ ఫాస్టాగ్ జారీ కేంద్రం వద్ద.. అతి తక్కువ సమయంలోనే ఫాస్టాగ్‌ పొందవచ్చని టీటీడీ తెలిపింది. ఆ తర్వాత మాత్రమే అలాంటి వాహనాలను తిరుమలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని తిరుమల తిరుపతి దేవస్తానం ఓ ప్రకటన విడుదల చేసింది.టీటీడీకి బ్యాటరీ బగ్గీలు విరాళంమరోవైపు టీటీడీకి రెండు బ్యాటరీ బగ్గీలు విరాళంగా అందాయి. బెంగుళూరుకు చెందిన చంద్రశేఖర్ అనే భక్తుడు మంగళవారం వీటిని టీటీడీకి అందించారు. వీటి విలువ రూ.11 లక్షలు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రెండు బ్యాటరీ బగ్గీలను డిప్యూటీ ఈవో లోకనాథం చేతికి దాత అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ డిప్యూటీ ఈవో చంద్రశేఖర్‌ను అభినందించారు.