ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రూ.4600 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలలో సెమీకండక్టర్ల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో భాగంగా దేశంలో మరో నాలుగు సెమీకండక్టర్ ప్రాజెక్టులు చేపట్టాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు ఇప్పటికే ఆరు ప్రాజెక్టులు వివిధ దశల్లో అమలులో ఉన్నాయి. తాజాగా మరో నాలుగు సెమీకండక్టర్ తయారీ యూనిట్లకు ఆమోదం లభించింది. SiCSem, కాంటినెంటల్ డివైస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (CDIL), 3D గ్లాస్ సొల్యూషన్స్ ఇంక్, అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ (ASIP) టెక్నాలజీస్ నుంచి సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్లు నెలకొల్పుతామంటూ వచ్చిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఒడిశాలో SiCSem, త్రీడీ గ్లాసెస్ సంస్థలు పెట్టుబడులు పెట్టనుండగా.. పంజాబ్‌లో సీడీఐఎల్, ఏపీలో అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ (ASIP) సంస్థ సెమీకండక్టర్ల యూనిట్ నెలకొల్పనుంది. అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ (ASIP), దక్షిణ కొరియాకు చెందిన APACT Co. Ltdతో టెక్నాలజీ టైఅప్ కింద, ఆంధ్రప్రదేశ్‌లో 96 మిలియన్ యూనిట్ల వార్షిక సామర్థ్యంతో సెమీకండక్టర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇక్కడ తయారు చేసిన ఉత్పత్తులు మొబైల్ ఫోన్‌లు, సెట్-టాప్ బాక్స్‌లు, ఆటోమొబైల్ అప్లికేషన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులలో తయారీలో ఉపయోగపడతాయని కేంద్రం వెల్లడించింది.సుమారుగా 4600 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నాలుగు సెమీకండక్టర్ తయారీ యూనిట్లు నెలకొల్పనున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 2034 మంది స్కిల్డ్ ప్రొఫెషనల్స్‌కు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అలాగే మరింత మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేంద్రం తెలిపింది. తాజాగా ఆమోదించిన నాలుగు ప్రతిపాదనలతో కలిపితే ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద ఇప్పటి వరకూ ఆరు రాష్ట్రాలలో రూ.1.60 లక్షల కోట్లతో పది సెమీకండక్టర్ తయారీ యూనిట్లకు ఆమోదం తెలిపినట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలో టెలికం, ఆటోమోటివ్, డేటా సెంటర్లు, కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ రంగాలలో సెమీకండక్టర్లకు డిమాండ్ పెరుగుతోందన్న కేంద్రం.. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో తాజాగా ఆమోదించిన నాలుగు ప్రాజెక్టులు ఆ అవసరాలను తీర్చుతాయని తెలిపింది.