వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు.. ఓ వైపు వర్షం, మరోవైపు భూకంపం

Wait 5 sec.

వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు అలజడి సృష్టించాయి. ఇవాళ ఉదయం 4 గంటల ప్రాంతంలో పరిగి మండల పరిధిలోని పలు గ్రామాల్లో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ప్రధానంగా భాషిరెడ్డిపల్లి ప్రాంతంలో తెల్లవారుజామున కొన్నిసెకన్ల పాటు భూమి కంపించని అంటున్నారు. ఓ వైపు జోరుగా వర్షం కురుస్తుండగా.. మరోవైపు భూమి స్వల్పంగా కంపించటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంప తీవ్రత తదితర వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కూడా నమోదయ్యాయి. 2024 ఫిబ్రవరిలో వికారాబాద్ జిల్లాలో 2.5 తీవ్రతతో స్వల్ప భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) నిర్ధారించింది. 2022లో కూడా జిల్లాలోని పరిగి మండలంలో భూమి కంపించిన సంఘటనలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం సాధారణంగా తక్కువ భూకంపాలు వచ్చే జోన్ II పరిధిలోకి వస్తుంది. అయినప్పటికీ.. అప్పుడప్పుడు స్వల్ప తీవ్రతతో కూడిన భూ ప్రకంపనలు నమోదవుతూ ఉంటాయి. గతేడాది డిసెంబర్‌లో ములుగు జిల్లాలో 5.3 తీవ్రతతో కూడిన భూకంపం నమోదైంది. అధికారులు గుర్తించారు. దీని ప్రభావం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా కనిపించింది. ఈ భూకంపం కారణంగా గోదావరి నది లోపల భూమి కంపించింది. ములుగు భూకంపం జరిగిన మూడు రోజుల తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో 3.0 తీవ్రతతో మరో స్వల్ప భూకంపం వచ్చింది. 2024 ఫిబ్రవరిలోనూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 3.5 తీవ్రతతో భూకంపం నమోదైంది. గతంలో రామగుండం ఉత్తర ప్రాంతంలో 4.8 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ఈ తరహా స్వల్ప భూకంపాలు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించనప్పటికీ, స్థానికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. భూ ప్రకంపనల సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ఇంట్లో ఉంటే బలమైన వస్తువల కింద తలదాచుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థలు సూచిస్తున్నాయి.