తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా ఆధారిత అభివృద్ధి దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఎగుమతులు, దిగుమతులను సులభతరం చేయడానికి డ్రైపోర్ట్-పోర్ట్ రైలు మార్గాల నిర్మాణాన్ని ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు, ఏపీతో మెరుగైన అనుసంధానానికి మార్గం సుగమం చేయనున్నాయి. హైదరాబాద్ సమీపంలోని ఫోర్త్‌సిటీ నుంచి ఏపీలోని అమరావతి వరకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల కేంద్ర హోంశాఖ నిర్వహించిన ఏపీ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై జరిగిన సమావేశంలో ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి గ్రీన్‌సిగ్నల్ లభించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖకు సూచించింది.ప్రస్తుతం ఉంది. అయితే, కొత్త ఎక్స్‌ప్రెస్ హైవేను హైదరాబాద్ నుంచి కాకుండా హైదరాబాద్‌కు భవిష్యత్ నగరంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న ఫోర్త్‌సిటీ నుంచి నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆలోచనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్‌అండ్‌బీ స్పెషల్ సీఎస్‌లతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చర్చించారు.అమరావతి-ఫోర్త్‌సిటీని కలుపుతూ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే వస్తే ఇది విజయవాడ-హైదరాబాద్ ప్రస్తుత జాతీయ రహదారికి సమాంతర రోడ్డు అవుతుందని తెలంగాణ అధికారులు ఏపీ అధికారులకు వివరించారు. ప్రస్తుత జాతీయ రహదారికి అటూఇటూగా 10 కి.మీ. దూరంలో దీన్ని నిర్మిస్తే ప్రత్యేక బెల్ట్‌లా తయారవుతుందని చెప్పారు. మధ్యలో ఉన్న ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఈ ఎలైన్‌మెంట్‌పై ఆంధ్రప్రదేశ్ స్పందన కోసం తెలంగాణ సర్కార్ ఎదురుచూస్తోంది.తెలంగాణకు తీరప్రాంతం లేకపోవడంతో ఓడరేవులు లేవు. దీంతో బియ్యం, చమురు, ఎరువులు, సిమెంటు వంటి వస్తువుల ఎగుమతులు, దిగుమతులకు వ్యయప్రయాసలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి, తెలంగాణ ప్రభుత్వం అమరావతి నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్ హైవేకు హైదరాబాద్ శివారులో ఏర్పాటుచేసే జంక్షన్ వద్ద డ్రైపోర్టు నిర్మించాలని భావిస్తోంది. ఈ డ్రైపోర్టు నుంచి మచిలీపట్నం నౌకాశ్రయం వరకు కొత్త రైలు మార్గం నిర్మించేలా కసరత్తు జరుగుతోంది. నౌకాశ్రయం తరహాలో డ్రైపోర్టులో కంటైనర్ యార్డులు, కార్గో నిర్వహణ వంటి కార్యకలాపాలు జరుగుతాయి. కొత్త ఎక్స్‌ప్రెస్ హైవేకి సమీపంలోనే డ్రైపోర్టు-మచిలీపట్నం నూతన రైలు మార్గం ఉండేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.ఈ ప్రతిపాదనలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాణిజ్యాన్ని, రవాణాను మెరుగుపరచడమే కాకుండా, పారిశ్రామిక అభివృద్ధికి కూడా దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తే ఈ ప్రాజెక్టులు వేగవంతమయ్యే ఛాన్స్ ఉంది.