రాయలసీమకు చెందిన సీనియర్ నేత, టీడీపీ ఎమ్మెల్యే వైఎస్సార్‌సీపీలోకి వెళుతున్నారా?.. కొంతకాలంగా ఆయన తెలుగు దేశం పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారా?.. మంత్రి పదవి రాలేదని ఆయన అలిగారా?.. అసెంబ్లీకి, కడపలో జరిగిన టీడీపీ మహానాడుకు కూడా అందుకే వెళ్లలేదా?.. తన నియోజకవర్గంలో మరో టీడీపీ నేత పెత్తనం చేయడంపై ఆగ్రహంతో ఉన్నారా?.. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఏడాదికే వైఎస్సార్‌సీపీలోకి వెళ్లడం ఏంటి?.. మరో నాలుగేళ్లు అధికారాన్ని వదిలి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు?.. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాతో పాటుగా ఏపీ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? అనే కదా అనుమానం. ఏపీ రాజకీయాల్లో, రాయలసీమలో, అందులోనూ ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని . అయితే ఈ ప్రచారంపై ఎట్టకేలకు సదరు ఎమ్మెల్యే స్పందించారు.. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు.. కాంగ్రెస్ పార్టీ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. అంతేకాదు కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్రి విభజన తర్వాత పరిస్థితి మారింది.. అయినా సరే కోట్ల కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు.. ఆమె భార్య ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు.. ఆ ఎన్నికల్లో సూర్యప్రకాష్ రెడ్డి మరోసారి కర్నూలు నుంచి ఎంపీగా.. ఆయన సతీమణి కోట్యల సుజాతమ్మ ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. అయితే కోట్ల దంపతులు 2024లో కూడా ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఒకటే టికెట్ ఇస్తానని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ఎంపీగా కాకుండా డోన్ ఎమ్మెల్యేగా పోటీచేయించారు.. ఆయన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై విజయం సాధించారు. సూర్యప్రకాష్ రెడ్డి డోన్ ఎమ్మెల్యేగా గెలవడంతో మంత్రి పదవి ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు.. కానీ ఆయనకు ఛాన్స్ దక్కలేదు.అయితే ఇటీవల అసెంబ్లీకి వెళ్లలేదు, టీడీపీ మహానాడుకు కూడా దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో సూర్యప్రకాష్ రెడ్డి తెలుగు దేశం పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. మంత్రి పదవి రాలేదని ఆయన అలిగారని.. అందుకే అసెంబ్లీకి, కడపలో జరిగిన టీడీపీ మహానాడుకు కూడా డుమ్మా కొట్టారంటూ ఊహాగానాలు వినిపించాయి. అలాగే డోన్ నియోజకవర్గంలో మరో టీడీపీ నేత సుబ్బారెడ్డి పెత్తనం చేయడంపై ఆగ్రహంతో ఉన్నారని కొందరు చర్చించుకున్నారు. అయితే రెండు, మూడురోజులుగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలోకి వెళుతున్నట్లుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సూర్యప్రకాష్ రెడ్డి స్పందించారు.తాను వైఎస్సార్‌సీపీలోకి వెళుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. తాను టీడీపీని వీడేది లేదని.. మంత్రి పదవి రాలేదనే అసంతృప్తి తనకు లేదన్నారు. తాను డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టానని.. మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే అధిష్టానం ఇస్తుందన్నారు. తన కాలికి సర్జరీ చేయించుకున్నానని, నిమోనియాతో బాధపడ్డానన్నారు.. కోలుకోవడానికి సమయం పట్టిందన్నారు. తాను మహానాడుతో పాటూ ఇతర కార్యక్రమాలకు రాలేకపోతున్నానని అధినాయకత్వానికి, చంద్రబాబుకు చెప్పానన్నారు. తాను ఒకసారి కాంగ్రెస్ పార్టీని వదిలేసి టీడీపీలోకి వచ్చానని.. తాను ఆ పార్టీలోనే కొనసాగుతానన్నారు. తాను నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వం కార్యక్రమాలలో పాల్గొంటున్నానని.. పార్టీ మారతానంటూ తప్పుడ ప్రచారం చేస్తు్న్నారన్నారు.