ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులపై గ్రీన్ టాక్స్ భారాన్ని చంద్రబాబు ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు 12 ఏళ్లు పైబడిన లారీలకు పన్ను తగ్గించింది. పది టన్నుల లారీలపై రూ.5,000 పన్నును రూ.1,500 లకు తగ్గించారు. 30 టన్నుల లారీలపై రూ.15,000 పన్నును రూ.3,000 లకు తగ్గించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఈ హామీ ఇచ్చారు.. ఇప్పుడు దానిని నెరవేర్చారు. గత ప్రభుత్వ హయాంలో పర్యావరణం పేరుతో పాత వాహనాలపై ఎక్కువ పన్ను వేసిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో లారీ యజమానులు చాలా ఇబ్బంది పడ్డారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పన్ను తగ్గిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు హామీ ఇచ్చారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత లారీ యజమానుల సంఘం చంద్రబాబుకు తమ సమస్యను విన్నవించిన సంగతి తెలిసిందే. వెంటనే స్పందించిన ప్రభుత్వం పన్ను తగ్గించింది.. అనంతరం కేబినెట్‌లో కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉత్తర్వులు మాత్రం ఆలస్యం అయ్యాయి. చివరికి బుధవారం రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంపై ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆనందం వ్యక్తం చేసింది. తమ సమస్యపై సానుకూలంగా స్పం దించిన సీఎంకు, రవాణా మంత్రికి రవాణా వాహనాల యాజమాన్యం రుణపడి ఉంటుంది అన్నారు. లారీ యజమానులకు మేలు జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం పేరుతో రవాణా వాహనాలపై ఎక్కువ భారం వేసింది అంటున్నారు. గతంలో గరిష్టంగా రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు పన్ను ఉండగా, ఇప్పుడు రూ.1,500 నుంచి రూ.3 వేల వరకు మాత్రమే ఉంటుంది తెలిపారు. తెలంగాణలో ఉన్న విధంగానే ఇక్కడ కూడా పన్ను వసూలు చేయనున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 7 నుంచి 12 ఏళ్ల వాహనాలకు ఏడాదికి రూ.1,500 హరిత పన్ను ఉంది. 12 ఏళ్లు దాటిన వాహనాలకు రూ.3,000 వసూలు చేస్తున్నారు. ఏపీలో కూడా దాదాపు ఇంతే పన్ను ఫిక్స్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు గ్రీన్ ట్యాక్స్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన హామీ ఇచ్చారు. గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని సరకు రవాణా వాహనదారులకు చెప్పారు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కళ్యాణ్ లారీ యజమానులతో సమావేశాలు నిర్వహించారు. గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని హామీ ఇచ్చారు.. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నారు.కేంద్రం పాత వాహనాల సంఖ్యను తగ్గించాలని భావించింది.. అందుకే గ్రీన్ ట్యాక్స్ పెంచే అవకాశం ఇచ్చింది. దీంతో గత ప్రభుత్వం 2022లో ఈ ట్యాక్స్‌ను భారీగా పెంచింది. ఏడేళ్లు దాటిన సరకు రవాణా, ప్రజారవాణా వాహనాలకు గతంలో రూ.200 ఫీజు ఉంటే.. దానిని దానిని రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు పెంచింది. 7-10 ఏళ్ల వాహనాలకు సగం త్రైమాసిక పన్ను, 10-12 ఏళ్ల వాహనాలకు ఒక త్రైమాసిక పన్ను, 12 ఏళ్లు దాటిన వాహనాలకు రెండు త్రైమాసికాల పన్నులు చెల్లించాలని ఆదేశించింది. ఏడాదికి గరిష్టంగా రూ.15వేల నుంచి రూ.20 వేలు చెల్లించాల్సి రావడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు.