రాజకీయాల్లో సాధారణంగా విపక్ష పార్టీలో ఉన్న నేతలు రాజీనామాలు చేస్తుంటారు. అధికార పార్టీ ఆశీర్వాదం కోసం, లేదా అధికార పార్టీలలోకి చేరాలనే ఉద్దేశంతో విపక్ష పార్టీలకు వీడ్కోలు చెప్తుంటారు. కానీ నంద్యాల జిల్లాలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. అధికార టీడీపీకి ఇద్దరు నేతలు షాక్ ఇచ్చారు. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని గుంప్రమాన్‌దిన్నె , ఆమె భర్త కుందనూరు మోహన్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు. మోహన్ రెడ్డి వాటర్‌ యూజర్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌‌గా ఉన్నారు. తులసమ్మ శిరివెళ్ల ఎంపీడీవోకు రాజీనామా పత్రం అందజేయగా.. మోహన్ రెడ్డి కలెక్టర్‌ను కలిసి తమ రాజీనామా లేఖ సమర్పించారు. భూమానాగిరెడ్డి విధేయులుగా ఇన్నేళ్లూ వెన్నంటే నడిచామని.. కానీ కార్యకర్తలకు సరైన గుర్తింపు, న్యాయం దక్కడం లేదని రాజీనామా సందర్భంగా మోహన్ రెడ్డి దంపతులు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే పదవులకు రాజీనామా చేసినట్లు రెండు రోజుల కింద వెల్లడించారు. అధికార టీడీపీకి, అందులోనూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు మద్దతుదారులుగా ఉన్న వీరు రాజీనామా చేయడం రాజకీయంగా కలకలం రేపింది. అలాగే ఎంపీటీసీ, ఆమె భర్త తమ పదవులకు రాజీనామా చేయడంతో ఇద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే రెండు రోజుల్లోనే పరిస్థితులు మారిపోయాయి. వైసీపీలో చేరనున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మోహన్ రెడ్డి తాజాగా ఖండించారు. తాము తమ పదవులకు రాజీనామా చేశాం కానీ, పార్టీకి కాదని.. టీడీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. తమ ప్రాణం ఉన్నంత వరకూ భూమానాగిరెడ్డి కుటుంబానికి విధేయులుగానే ఉంటామని.. అఖిలప్రియ ఏ నిర్ణయం తీసుకుంటే తమది కూడా అదే బాటేనని కుందనూరు మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతోనే పదవులకు రాజీనామాలు చేశామని.. భూమా వారసులతోనే తమ ప్రయాణం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. స్థానికంగా నెలకొన్న కారణాలతోనే తమ పదవులకు రాజీనామా చేసినట్లు మోహన్ రెడ్డి వెల్లడించారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో దాదాపుగా అన్నిచోట్లా ఏకపక్ష విజయాలు సాధించింది. అయితే గుంప్రమాన్‌దిన్నెలో మాత్రం మోహన్‌రెడ్డి తన భార్యను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దింపి విజయం సాధించారు. అలాగే రాజకీయంగా మొదటి నుంచి భూమా కుటుంబానికి మోహన్ రెడ్డి కుటుంబం మద్దతుదారులుగా కొనసాగుతున్నారు. అయితే ఊహించని రీతిలో భార్యాభర్తలు ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేయటంతో నంద్యాల రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చ జరుగుతోంది.