'క్లైమోర్ మైన్లే నన్నేం చేయలేకపోయాయి.. వీళ్లేం చేస్తారు'.. జగన్‌‌పై చంద్రబాబు విమర్శలు

Wait 5 sec.

ప్రెస్‌మీట్‌కి ముఖ్యమంత్రి కౌంటర్ అటాక్ ఇచ్చారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా హంద్రీనీవా నీటి విడుదల సందర్భంగా రైతులతో మాట్లాడిన చంద్రబాబు ప్రతిపక్ష నేతపై విమర్శలు గుప్పించారు. కరువు కష్టాలు, ప్రజల బాధలు తనకే తెలుసన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం చేశారని, వైఎస్సార్‌సీపీ హయాంలో అవినీతి జరిగిందంటూ ఆరోపించారు. జగన్‌మోహన్ రెడ్డి విమర్శలు తననేమీ చేయలేవని.. క్లైమోర్ మైన్లే తట్టుకున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో ఈ రోజు ముఖ్యమంత్రి పర్యటించారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి హంద్రీనీవాకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తాను కంకణం కట్టుకున్నానని.. కానీ చాలా మంది ఇబ్బందులకు గురి చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. విమర్శలు చేసినా, బూతులు తిట్టినా, శాపాలు పెట్టినా అవేవీ తన మనస్సుకు రాలేదని.. ఎందుకంటే క్లైమోర్ మైన్లే ఏం చేయలేనప్పుడు, ఇలాంటి వాళ్లు ఏం చేయలేరు అంటూ చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో విమర్శించారు. తానూ రాయలసీమలోనే పుట్టానని, ఇక్కడ ప్రజల బాధలు తనకు తెలుసన్నారు. రాయలసీమ చరిత్రను తిరగరాయాలని ఎన్టీఆర్ మొట్టమొదట ఆలోచించారని.. హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆరే అని గుర్తు చేశారు. హంద్రీనీవా ద్వారా నీళ్లు 550 కిలోమీటర్లు ప్రవహించి చిత్తూరు, కుప్పం వరకు వెళ్తోందని.. ఆరు లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మల్యాల ద్వారా సుమారు 4 టీఎంసీల నీరు తీసుకెళ్లొచ్చన్నారు. రాష్ట్రానికి పేరు రావాలని, ప్రజల జీవితాలు బాగుపడాలని నిత్యం కోరుకునే వ్యక్తి తానని చంద్రబాబు రైతులతో అన్నారు. రాయలసీమ ప్రాంతానికి వైఎస్సార్ సీపీ హయాంలో రూ. 2 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. హంద్రీనీవాకు అయితే ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారా? అంటూ ప్రశ్నించారు. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు.నదుల అనుసంధానం జరగాలనేది తన జీవిత ఆశయమని చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానిస్తే కరువు అనే మాటే ఉండదని చెప్పారు. ప్రస్తుతానికి రాయలసీమలోని అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయని, రాయలసీమను రతనాల సీమగా మార్చే ధైర్యం వచ్చిందన్నారు. శ్రీశైలం నుంచి ఎస్ఆర్‌బీసీ, ముచ్చుమర్రి, మల్యాల కాల్వలు వస్తాయని.. హంద్రీనీవా నుంచి అనంతపురం, పత్తికొండ, గొల్లపల్లికి మరో కాల్వ వెళ్తుందన్నారు. గాలేరు-నగరి నుంచి గండికోట, అవుకు, మైలవరానికి నీళ్లు వస్తాయన్నారు. శ్రీశైలం నుంచి ప్రారంభమైన నీరు తిరుపతికి వెళ్లే పరిస్థితి వస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు.