కాలం మారింది.. మీ పిల్లల పెంపకంలో ఈ 6 సూత్రాలు పాటించాల్సిందే..!

Wait 5 sec.

"కొరడా దెబ్బ తగలకపోతే పిల్లలు చెడిపోతారు".. అని గతంలో తల్లిదండ్రులు భావించేవారు. పిల్లల్ని కూడా అలానే పెంచేవారు. అప్పట్లో పిల్లలు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. ఇంట్లో అయినా.. పాఠశాలలో అయినా బెత్తం పిల్లల్ని క్రమశిక్షణలో పెడుతుందని అనుకునేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది. పిల్లల్ని గారాబంగా పెంచుతున్నారు. పిల్లలకు చిన్న ముల్లు గుచ్చుకున్నా.. తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. పాత తరం వారు అనుసరించిన పెంపకం పద్ధతులతో.. ఇప్పటి జెన్ జీ పిల్లల్ని పెంచే తల్లిదండ్రులు విభేదిస్తున్నారు. ఇటీవల తమిళనాడులో ఒక 12 ఏళ్ల బాలుడు తన పాఠశాల మూత పడాలని.. పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ పంపించాడు. 2024లో అనేక మెట్రో నగరాల్లో మైనర్లు డ్రగ్స్‌కు బానిసలై నేరాలకు పాల్పడిన కేసులు నమోదయ్యాయి. ఇక నవంబర్ 2023లో హైదరాబాద్‌లో ఒక 17 ఏళ్ల టీనేజర్.. తన స్నేహితులతో కలిసి బైక్‌లు, మొబైల్ ఫోన్లు దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. పిల్లలు నేరాలకు పాల్పడటానికి పేదరికం.. సమాజంలో పెరుగుతున్న హింస వంటి అనేక కారణాలు ఉన్నప్పటికీ.. తల్లిదండ్రుల పెంపకం ప్రధాన పాత్ర పోషిస్తుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో జెన్ జీ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు పాతకాలం పద్ధతులను ఎందుకు విబేధిస్తున్నారో? తెలుసుకుందాం.1. దండించడం వద్దు..పాత కాలంలో అమ్మ చేతిలో గరిటె.. వంట చేయడానికే కాదు.. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి కూడా ఉపయోగపడేది. అప్పట్లో పిల్లలు తప్పుచేస్తే.. కొరడా వంటి వాటితో దండించడం ప్రేమతో కూడిన దిద్దుబాటు చర్యగా భావించేవారు. అయితే ఆధునిక పరిశోధనలు ఈ పద్ధతులను విభేదిస్తున్నాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం.. శారీరక శిక్ష వేయడం ద్వారా పిల్లలలో దూకుడు స్వభావం పెరుగుతుందట. అంతేకాకుండా పిల్లలకు బాధ్యత, స్వీయ-నియంత్రణను నేర్పించడంలో ఇది ఉపయోగపడదని చెబుతోంది. అందుకే ఇప్పటి తల్లిదండ్రులు శారీరక శిక్షకు బదులుగా.. ప్రాబ్లమ్ సాల్వింగ్ సంభాషణలు, స్కిల్ బిల్డింగ్‌పై వంటి వాటిపై ఆధారపడుతున్నారు. అయితే ఈ పద్ధతి ద్వారా ఫలితం నెమ్మదిగా ఉన్నా.. ఇది స్వీయ-నియంత్రణను నేర్పిస్తుందట.2. పిల్లల భావాలను అణచివేయొద్దు..పిల్లల భావాల్ని అణచివేయడం ద్వారా వారికి అభద్రతా భావం ఏర్పడుతుందని మానసిక వైద్యులు చెబుతున్నారు. సురక్షితంగా, భద్రంగా, ఓదార్చినట్లు మాట్లాడే వాతావరణం ఉంటే.. పిల్లల బాల్యం వికసిస్తుందని అంటున్నారు. అందుకే పిల్లలు ప్రశ్నలు అడిగితే చిరాకు పడకుండా.. ప్రశ్నలు అడగనివ్వాలని నిపుణులు అంటున్నారు. పిల్లలు తమ డిస్‌అగ్రీమెంట్ వ్యక్తపరచడానికి (మర్యాదపూర్వకంగా).. వారి భావోద్వేగాలను పంచుకోవడానికి స్పేస్ ఇవ్వాలని సూచిస్తున్నారు. అందుకే ఈ తరం తల్లిదండ్రులు కూడా అదే ఫాలో అవుతున్నారు. 3. అబ్బాయిలు ఏడవరు..!పాతకాలంలో మగ పిల్లలు ఏడిస్తే.. "అబ్బాయిలు ఏడవరు, అమ్మాయిలా ఏడుస్తున్నాడేంటీ.." అంటూ తిట్టేవారు. అయితే ఏళ్ల తరబడి చేసిన కొన్ని పరిశోధనల ప్రకారం.. ఇలా అబ్బాయిల్లో సున్నితత్వాన్ని అణచివేస్తే.. ఒంటరితనాన్ని పెంచుతుందని అంటున్నారు. అంతేకాకుండా పిల్లల్లో నిరాశ, హింస ప్రవృత్తి పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పటి జెన్ జీ తల్లిదండ్రులు పిల్లల ఎమోషనల్ రేంజ్‌ను నార్మల్ చేస్తున్నారు. బాధ, భయం, ఇబ్బంది వంటి భావాలను అర్థమయ్యేలా చెబుతున్నారు. ఇలా చెప్పడం బలహీనత కాదు.. ఎమోషనల్ లిటరసీ నేర్పించడమే. 4. ప్లేట్‌లో ఉన్నదంతా పూర్తి చేయాలి..గతంలో పిల్లలు తినేటప్పుడు ప్లేట్లో ఉన్నదంతా తినెయ్యాలి.. వేస్ట్ చేయొద్దు అనేవారు. ఇది మంచికే అయినప్పటికీ చెప్పే పద్ధతి కఠువుగా ఉండేది. ఇలా పిల్లలను బలవంతం చేయడం ద్వారా క్రమరహిత ఆహారపు అలవాట్లకు బీజం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు.. ఏ ఆహారం ఎప్పుడు అందించాలో నిర్ణయిస్తారు. పిల్లలు ఎంత తినాలి అనేది నిర్ణయించుకుంటారు. ఈ మేరకు డివిజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ (division of responsibility)ని పిల్లలకు నేర్పించాలని సిఫార్సు చేస్తున్నారు పోషకాహార నిపుణులు.5. చెప్పాము కాబట్టి.. మీరు చేయాలి.."నోరు మూసుకుని చెప్పింది చెయ్.." పాత కాలం వారు తమ తల్లిదండ్రులను నుంచి ఇలాంటి ఆర్డర్‌లు చాలానే విని ఉంటారు. ఇలా చేస్తే.. పిల్లలు అర్గ్యూ చేయడం, తమ సమస్యలను వివరించే అవసరం ఉండదు కదా మరీ. ఇలా చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఉదాహరణకు పిల్లలు త్వరగా నిద్ర పోలేదనుకోండి.. అలాంటి వారికి బెదిరించి పడుకోండి అని చెప్పకుండా.. "నిద్ర మీ మెదడు పెరగడానికి సహాయపడుతుంది – అందుకే ఎనిమిదింటికి లైట్లు ఆపేయాలి" అని చెప్పాలి. ఇది పిల్లలకు లాజిక్, గౌరవం నేర్పిస్తుంది. ఇలా చేయడం ద్వారా.. కారణం అర్థం చేసుకున్న పిల్లలు.. తల్లిదండ్రులు చెప్పిన మాట విలువను అర్థం చేసుకుంటారు. 6. సక్సెస్ అంటే ఏ గ్రేడ్ కాదు..ఒకప్పుడు పిల్లల మార్కులపై తల్లిదండ్రులు ఎక్కువగా ఫోకస్ పెట్టేవారు. అకౌంటెంట్, ఇంజనీర్, డాక్టర్.. అంటూ పిల్లలపై ఒత్తిడి చేశారన్నది మనమంతా చూసిందే. ఇప్పటికి కూడా ఇది అంతగా మారలేదు. అయితే ఈ కాలం తల్లిదండ్రులు కొంతమంది సక్సెస్‌ను.. వెల్‌-బీయింగ్, విలువ-ఆధారిత పనిగా చూస్తున్నారు. పిల్లల్ని కూడా అలానే పెంచుతున్నారు. పాతకాలం విధానాలను అనురించిన వారంతా చెడ్డవారు అని అనుకోకూడదు. చాలా మంది వారికి తెలిసిన జ్ఞానంతో తమ వంతు కృషి చేశారు. పిల్లల్ని ఏదో ఒక విధంగా దారిలో పెట్టారు. అయితే సైన్స్, సంస్కృతి, పిల్లల పెంపకంలో అవగాహన క్రమంగా మారుతూ వస్తోంది. పిల్లలకు ఏదైనా చెప్పే ముందు.. "ఇది నా పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతుందా".. అని తల్లిదండ్రులు ఆలోచించాలి. అప్పుడే పిల్లల భవితకు బంగారు బాటలు వేయగలం.