ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమైన గమనిక.. ఇకపై కరెంట్ బిల్లులు చాలా ఈజీగా కట్టెయొచ్చు. APEPDCL (ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ) కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి వాటి ద్వారా చెల్లించవచ్చు. దీని కోసం సింపుల్‌గా బిల్లుపై ఉండే క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేసి వెంటనే చెల్లింపులు చేయొచ్చు. మీటర్ సర్వీస్ నెంబర్ తప్పుగా ఎంటర్ చేసి ఇబ్బంది పడే వారికి, డిజిటల్ చెల్లింపులపై అవగాహన లేనివారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.గతంలో బిల్లు కట్టాలంటే ఏపీఈపీడీసీఎల్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌కు వెళ్లాల్సి వచ్చేది. అక్కడ మీటర్ సర్వీస్ నెంబర్ నమోదు చేయాలి. ఒక్కోసారి నెంబర్ తప్పుగా కొడితే వేరే వాళ్ల బిల్లు కట్టేసే ప్రమాదం ఉండేది. డిజిటల్ చెల్లింపులు రాని వాళ్ళు కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. అక్కడ సర్వర్ పనిచేయకపోతే గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెడుతూ ఏపీఈపీడీసీఎల్‌ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా వినియోగదారులు ఇంట్లో కూర్చొని సులభంగా బిల్లులు చెల్లించవచ్చు. ప్రతి నెలా వినియోగదారునికి ఇచ్చే విద్యుత్తు బిల్లు కింద క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. దాన్ని ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం ద్వారా స్కాన్‌ చేసి వెంటనే బిల్లు చెల్లింపులు చేయొచ్చు. విద్యుత్ వినియోగదారులకు సేవలను మరింత సులభతరం చేయడానికి క్యూఆర్‌కోడ్ చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ సర్వీసులను మినహాయించి, అన్ని ప్రైవేటు సర్వీసులలో ఈ విధానం అందుబాటులో ఉంది. వినియోగదారులు సులభంగా బిల్లులు చెల్లించేందుకు బిల్లు రీడర్లు అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు క్యూఆర్‌కోడ్ ద్వారా విద్యుత్ బిల్లు చెల్లింపు సులభంగా, వేగంగా జరుగుతుంది. క్యూఆర్‌కోడ్ ద్వారా బిల్లు చెల్లించడం చాలా సులభం అని అధికారులు అంటున్నారు. మొబైల్‌లో ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ఉంటే ఇంట్లో నుంచే ఎప్పుడైనా బిల్లు చెల్లించవచ్చని చెబుతున్నారు. దీని ద్వారా సమయం ఆదా అవుతుందంటున్నారు.. బిల్లు చెల్లింపు కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదంటున్నారు.