గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ లక్ష్యంగా ప్రారంభించిన హైడ్రా వ్యవస్థ ఏడాది కాలంలోనే వందలాది అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. అయితే, ఈ కూల్చివేతలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ధనవంతులు, పలుకుబడి ఉన్న వారి అక్రమ నిర్మాణాలను విడిచిపెట్టి, కేవలం నిరుపేదల ఇళ్లను మాత్రమే హైడ్రా కూల్చివేస్తోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం ఉద్దేశాలు మంచివైనప్పటికీ.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కూల్చివేతల తీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద పెద్ద భవన సముదాయాలు, వాణిజ్య సముదాయాలు, లేఅవుట్లలోని అక్రమాలను వదిలిపెట్టి కూలీలు, చిరుద్యోగులు కష్టపడి కట్టుకున్న చిన్న చిన్న ఇళ్లను, గుడిసెలను లక్ష్యంగా చేసుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతులపై కమిషనర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో.. కొందరు రాజకీయ నేతలు హైడ్రాపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఎక్కడ కూల్చివేతలు జరిగినా వాటిని హైడ్రాకు ఆపాదిస్తున్నారన్నారు. రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి మూసీ నదిలోని ఆక్రమణలను తొలగిస్తుంటే వాటిని కూడా హైడ్రా చేసిందన్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువుల్లో పేదలు కట్టుకున్న ఇళ్లను హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చదని చెప్పారు. చేయడానికి సంపన్నులు, కొందరు రాజకీయ నాయకులు కట్టుకున్న ఫంక్షన్‌హాళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లు, గోడౌన్స్, ఇతర వ్యాపార కేంద్రాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని చెప్పారు. పేదలకు నష్టం చేయడం తమ ఉద్దేశం కాదని.. ప్రజలు అపోహలను నమ్మొద్దని సూచించారు. చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రా వ్యవస్థ అంచనాలకు మించి విజయాలను సాధిస్తోందని వెల్లడించారు. ఇప్పటివరకు 500 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను ఆక్రమణల నుండి విముక్తం చేశామని, మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ. 30 వేల కోట్లు ఉంటుందని ఆయన అంచనా వేశారు. ఈ భారీ ఎత్తున చేపట్టిన ప్రజల ఆస్తులను విపత్తుల నుండి, ముఖ్యంగా వరద ప్రమాదాల నుండి రక్షించడమే హైడ్రా ముఖ్యోద్దేశమని రంగనాథ్ స్పష్టం చేశారు.హైడ్రా కార్యకలాపాల్లో ఇస్తున్నామన్నారు. ఇప్పటికే 6 చెరువులను అభివృద్ధి చేస్తున్నామని, దీని ద్వారా అదనంగా 75 ఎకరాల భూమిని ఆక్రమణల నుండి కాపాడగలిగామని కమిషనర్ తెలిపారు. ఈ చెరువుల్లోని పూడికను తొలగించడం ద్వారా అదనంగా 30 కోట్ల లీటర్ల వరద నీటిని నిల్వ చేసే సామర్థ్యం పెరుగుతుందని, ఇది భవిష్యత్తులో నగరానికి వరదల నుండి రక్షణ కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చెరువులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా, ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలోని 950కి పైగా చెరువులకు హద్దులను స్పష్టంగా నిర్ధారిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అన్ని చెరువుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, వాటిని మరింత పటిష్టంగా పరిరక్షిస్తామని చెప్పారు. చెరువులే కాకుండా, నగరంలోని నాలాల ఆక్రమణలను కూడా తొలగించి, వరద నీరు సజావుగా ప్రవహించేలా చర్యలు తీసుకుంటామని రంగనాథ్ స్పష్టం చేశారు.