తెలంగాణకు రెయిన్ అలర్ట్.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ

Wait 5 sec.

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాజాగా.. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రానికి మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. వాయువ్య మధ్యప్రదేశ్ నుంచి నైరుతి ఉత్తరప్రదేశ్ వరకు ఒక వాయుగుండం కొనసాగుతోందని తెలిపారు. ఇది క్రమంగా తూర్పు ఆగ్నేయ దిశలో కదిలి ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడిందని.. దీనికి సమాంతరంగా ఒక ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోందన్నారు. ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD–హైదరాబాద్) డైరెక్టర్ డాక్టర్ కే. నాగరత్న తెలిపారు.నేడు రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి,యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం కురిసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు. రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని పొలాల్లో నీరు నిలిచి ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక శుక్రవారం భారీ నుండి అతిభారీ వర్షాలు కురుశాయి. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 50 చోట్ల 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.