సంప్రదాయాలు, సంస్కృతికి గౌరవమిచ్చే భూమి ఇది. భారత సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లోనూ గౌరవిస్తారు. శృంగారం, పడకగదికి సంబంధించిన వ్యవహారాలపై విచ్చలవిడిగా మాట్లాడటాన్ని సభ్య సమాజం తప్పుగా భావిస్తుంది. పురుషులనే తప్పుబడుతుంటే, కొంత కాలంగా అమ్మాయిలు కూడా వీటిపై బూతులు మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మరింత సంచలనంగా మారింది. ఆ వీడియోలో అమ్మాయిలు జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు. అంతా శృంగారానికి సంబంధించిన డబుల్ మీనింగ్ కంటెంటే. ఈ వీడియోలకు సంబంధించి మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోల్లో కనిపిస్తున్న వారు నిజమైన అమ్మాయిలు కాదని, AI సాయంతో వీటిని రూపొందించారని తేలింది. కొంత మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఈ అశ్లీల కంటెంట్‌తో వీడియోలు రూపొందించి వైరల్ చేస్తున్నట్లు భావిస్తున్నారు. మహిళలు బూతులు మాట్లాడుతున్నట్లు ఉన్న ఈ వీడియోలన్నీ ఏఐ టూల్స్‌తో రూపొందించినవేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మహిళలను పూజించే మన దేశంలో.. కొంత మంది చేస్తున్న ఈ అసహ్యకరమైన పనులు, చేష్టలు ఇప్పుడు దేశానికే తలవంపులు తీసుకువచ్చేలా ఉన్నాయని సంప్రదాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటిది అనే మనం తరచూ వింటూనే ఉంటాం. ఒక్క సోషల్ మీడియానే కాదు.. టెక్నాలజీ ఏదైనా దాన్ని మంచికీ, చెడుకూ వాడుకోవచ్చు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ కోవకు చెందిందే. ఇప్పుడు సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. రెండూ కలిసిపోయాయి. సోషల్ మీడియాను తప్పుగా వాడటం పట్ల ఇప్పటికే తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతుండగా.. దానికి ఏఐని కూడా జత కలిపి.. కొందరు చేస్తున్న వికృత క్రీడలు.. మరింత భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏఐ సాయంతో తయారు చేసిన ఫేక్ వీడియోలను.. అచ్చం నిజమైన వీడియోల్లాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కొందరు రాక్షసానందం పొందుతున్నారు. స్టాండప్ కామెడీ అని.. బూతు పురాణాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఈ స్టాండప్ బూతు పురాణం వెనుక కొందరు టెకీలు ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. స్టాండప్ కామెడీ పేరుతో అశ్లీల జోక్‌లతో కొందరు యువతులు రెచ్చిపోతున్నారు. ఇక ఈ వీడియోలను నెటిజన్లు షేర్ చేయడంలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అసలేం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కొందరు టెకీలు.. ఏఐ సాయంతో ఈ బూతు స్టాండప్ కామెడీని సాగిస్తున్నట్లు తేలింది. చూడటానికి అచ్చంగా అమ్మాయిల్లాగే కనిపిస్తూ.. నిజమైన వీడియోలే అనేలా ఉన్న ఈ స్టాండప్ కామెడీతో డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, జోక్‌లతో నెట్టింట రచ్చ చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీని.. ఇలాంటి గలీజ్ పనులకు ఉపయోగించడం పట్ల టెక్ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టాండప్ కామెడీ పేరుతో పైశాచికంస్టాండప్ కామెడీ అంటే.. చాలా మంది ఆసక్తిగా చూస్తారు. మన దేశంలో ఎంతోమంది బాగా పాపులర్ అయ్యారు. వాళ్లు ఈవెంట్ల నిర్వహిస్తున్నారంటే.. చాలామంది ఫ్యాన్స్ అక్కడికి పరిగెత్తుతుంటారు. చిన్న చిన్న జోక్‌లతో.. ప్రస్తుతం మన చుట్టూ జరిగే సంఘటనలను ఆధారంగా చేసుకుని.. వాళ్లు చేసే కామెడీ.. కడుపుబ్బా నవ్విస్తుంటుంది. అయితే ఇప్పుడు అదే స్టాండప్ కామెడీ పేరుతో కొందరు తమ వికృత రూపాన్ని బయటపెట్టుకుంటున్నారు. మహిళలను, పురుషులను కించపరిచే విధంగా.. భార్యాభర్తలు, ప్రేమికుల మధ్య సంబంధాలను అవమానించేలా.. డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, సెటైర్లతో సోషల్ మీడియాను గబ్బు పట్టిస్తున్నారు.అశ్లీల జోక్‌లు, అసభ్యకరమైన ముచ్చట్లుకొందరు వ్యక్తులు ఏఐని దుర్వినియోగం చేస్తూ సమాజంలో వికృత ధోరణులకు తెరలేపుతున్నారు. కొందరు టెకీలు ఏఐని ఉపయోగించుకుని.. కొందరు మహిళలు స్టాండప్ కామెడీ చేస్తున్నట్లుగా వీడియోలు, ఆడియోలు సృష్టించి.. వాటిని నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఇక ఆ వీడియోలో అశ్లీల జోక్‌లు, అసభ్యకరమైన మాటలు, డబుల్ మీనింగ్ ముచ్చట్లతో జుగుప్సాకరంగా చేస్తున్నారు. ఇక ఆ వీడియోల్లో కనిపించే మహిళలు కూడా అర్ధ నగ్నంగా, అసభ్యకరమైన డ్రెస్‌లు వేసుకోవడం గమనార్హం. అయితే ఈ వీడియోలను రూపొందిస్తోంది మగవాళ్లేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.నిజమా.. కాదా.. గుర్తించని విధంగా వీడియోలుఅయితే ఆ వీడియోలను చూస్తే నిజమైన వీడియోలు గానే కనిపిస్తాయి. అవి ఏఐతో తయారు చేసిన వీడియోలు అని గుర్తు పట్టడం చాలా కష్టం. నిజమైన యువతులుగా.. వారే స్వయంగా డైలాగ్‌లు చెప్పినట్లుగా కనిపించడం గమనార్హం. దీనికి తోడు వాళ్లు కామెడీ చెప్పగానే బ్యాక్‌ గ్రౌండ్‌లో ఆడియన్స్ నవ్వుతున్నట్లుగా ఎడిటింగ్ కూడా చేసి పెడుతున్నారు. ఈ ఏఐ వీడియోలు వైరల్ కావడంతో అవి నిజమైనవే అని నెటిజన్లు భ్రమపడుతున్నారు. ఇలాంటి వీడియోల పట్ల నెటిజన్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.అశ్లీల కంటెంట్ సృష్టించేందుకు అనువుగా ఏఐప్రస్తుత డిజిటల్ వరల్డ్‌లో ఏఐ ద్వారా ఫేక్ వీడియోలు, డీప్‌ఫేక్‌లు, ఫేక్ వాయిస్‌లు సృష్టించడం ఇప్పుడు చాలా సులువుగా మారిపోయింది. కొందరు టెకీలు ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుని.. మహిళల ఫోటోలు, వీడియోలను సేకరించి.. వాటికి ఏఐ వాయిస్‌లను జోడించి.. నిజమైన వీడియోలాగా రూపొందిస్తున్నారు. ఇక ఆ స్టాండప్ కామెడీలో మహిళల పట్ల అసభ్యకరమైన, అశ్లీలమైన, కించపరిచే.. జోకులు, వ్యాఖ్యలు, సంభాషణలు చేసినట్లుగా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఆ వీడియోలు చూడటానికి నిజమైన స్టాండప్ కామెడీ షోల లాగే కనిపించడంతో.. సోషల్ మీడియాలో అవి తెగ వైరల్‌గా మారుతున్నాయి.సమాజంపై తీవ్ర ప్రభావంఈ వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించినవి అని తెలియని చాలా మంది నెటిజన్లు.. అవి నిజమైన వీడియోలు అని భ్రమపడుతున్నారు. అంతేకాకుండా ఆ వీడియోల్లో నిజంగానే మహిళలు.. అలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారని.. అలాంటి జోకులు వేస్తున్నారని భావించి.. కామెంట్లలో దారుణంగా తిడుతున్నారు. ఏఐ కంటెంట్ మహిళల పట్ల సామాజిక దృక్పథాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇలాంటి వీడియోలు చూసిన కొందరు వ్యక్తులు.. నిజ జీవితంలోనూ మహిళల పట్ల ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, వేధింపులకు పాల్పడటం మరింత పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.తమ ఫోటోలు, వాయిస్‌ను ఉపయోగించి అసభ్యకరమైన వీడియోలను రూపొందించినపుడు.. సంబంధిత మహిళలు తీవ్రమైన మానసిక వేదనకు, అవమానాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇది వారి వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇలాంటి అశ్లీల కంటెంట్ సమాజంలో సామాజిక విలువలను, నైతికతను దెబ్బతీస్తుంది. కామెడీ పేరుతో మహిళలను కించపరచడం, అసభ్యకరంగా చూపించడం ప్రస్తుత యువతను పెడదోవ పట్టించే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏఐ కంటెంట్‌ను గుర్తించడం ఎలా?ఏఐ వీడియోలను సామాన్యులు గుర్తించడం కష్టంగా మారింది. డీప్‌ఫేక్ టెక్నాలజీ శరవేగంగా డెవలప్ అవుతుండగా.. దాన్ని గుర్తించే టెక్నాలజీ అంత వేగంగా అభివృద్ధి చెందడం లేదు. ఇదే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు, అసాంఘిక శక్తులకు ఒక బ్రహ్మాస్త్రంగా మారుతోంది. అయితే ఏదైనా వీడియో గానీ, ఫోటో గానీ ఫేక్ గానీ, ఏఐతో గానీ రూపొందించారని అనుమానం వస్తే.. దాన్ని గుర్తించేందుకు కొన్ని టూల్స్ ఉన్నాయి. AI Detector, TensorFlow, Sensity AI, Deepware AI, Resemble AI - Detect, FaceOnLive DeepFake Detector, Microsoft Video Authenticator, Intel's FakeCatcher వంటి వెబ్‌సైట్లను ఉపయోగించి ఏఐ వీడియోలను గుర్తించవచ్చు. వీటితోపాటు వీడియోల్లో ఉన్నవారి కదలికలు, మాటలకు వీడియోలకు సింక్ కాకపోవడం, వీడియోలో బ్లర్ కనిపించడం లాంటివి గుర్తించినపుడు అవి ఏఐ వీడియోలు అని భావించవచ్చు. దొరికితే కఠిన శిక్షలేమన దేశంలో ఇలాంటి అశ్లీల, ఫేక్ కంటెంట్ రూపొందించడం, దాన్ని సర్క్యులేట్ చేయడం సైబర్ నేరం కిందికి వస్తుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం 2000 ప్రకారం.. అశ్లీల కంటెంట్ తయారు చేయడం, దాన్ని ప్రసారం శిక్షార్హమైన నేరం. డీప్‌ఫేక్‌ల ద్వారా ఒకరి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడం.. వేధించడం వంటి నేరాలకు కఠిన శిక్షలు విధిస్తారు. ఇలాంటి బారిన పడిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఇక్కడ అతి పెద్ద సమస్య ఏంటంటే.. ఆ కంటెంట్‌ను ఎవరు రూపొందించారు, ఎక్కడి నుంచి సృష్టించారు అని గుర్తించడమే.ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవడం ఎలా?ఏఐ కంటెంట్‌ను గుర్తించేందుకు మరింత అత్యాధునిక టూల్స్‌ను డెవలప్‌ చేయాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కూడా తమ అల్గారిథంలను మెరుగుపరచుకుని, అభ్యంతరకరమైన కంటెంట్‌ను గుర్తించి, తొలగించాలి. ఏఐని దుర్వినియోగం చేస్తే.. చట్టాలను మరింత కఠినతరం చేయాలి. డీప్‌ఫేక్‌లు, అసభ్యకర కంటెంట్ సృష్టించే వారిని కఠినంగా శిక్షించాలి. ఈ ఏఐ కంటెంట్‌ పట్ల నెటిజన్లలో అవగాహన కల్పించడం ముఖ్యం. నెటిజన్లు కూడా తాము చూస్తున్న కంటెంట్ నిజమైందా లేదా అని విశ్లేషించుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ డెవలపర్లు, టెక్ నిపుణులు నైతిక బాధ్యతను వహిస్తూ.. ఏఐ టూల్స్‌ను దుర్వినియోగం చేయకుండా నిరోధించాలని పేర్కొంటున్నారు.ఏఐని డెవలప్ చేసి.. మనిషి ఎంతో ఎత్తుకు ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఇలా టెక్నాలజీని దుర్వినియోగం చేసి.. సమాజానికి పెను ముప్పుగా మార్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వాలు, టెక్ సంస్థలు, నెటిజన్లు సహా అంతా కలిసికట్టుగా కృషి చేస్తేనే.. ఇలాంటి విపరీత చర్యలను అరికట్టడం సాధ్యం అవుతుంది.