తెలంగాణలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఫైలేరియా, హెచ్‌ఐవీ, కిడ్నీ వ్యాధి బాధితులకు పెన్షన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. కింద 42.96 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తున్నారు. సాధారణ పింఛను నెలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.4,016 ఇస్తున్నారు. అయితే కొత్త పెన్షన్లు అప్లయ్ చేసుకునేందుకు అధికారులు కొర్రీలు పెడుతుండటంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ల దరఖాస్తుకు అమలు చేస్తుండటంతో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న పత్రాలతో పాటు అదనంగా ఓటరు గుర్తింపు కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేయడంతో అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అనర్హులను ఏరివేయాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా, ఆచరణలో ఎదురవుతున్న సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వృద్ధులకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బ్యాంకు పాసు పుస్తకం అవసరమయ్యేవి. వితంతువులకు భర్త మరణ ధ్రువపత్రం, దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్, ఒంటరి మహిళలకు విడాకుల పత్రం, చేనేత, గీత, బీడీ కార్మికులకు వృత్తి ధ్రువపత్రం జత చేస్తే పింఛన్లు మంజూరు చేసేవారు. ఇప్పుడు అదనంగా అడుగుతున్న ఓటరు గుర్తింపు కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తుదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.స్థానికతకు ఆధార్‌ సరిపోతుందంటున్నా, ఓటరు కార్డు కూడా కావాలని అధికారులు పట్టుబడుతున్నారు. చాలామంది వృద్ధులకు పాత ఓటరు కార్డులు ఎక్కడ పెట్టారో గుర్తుండక, కొత్తవి పొందడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం మీసేవ ద్వారా తహసీల్దార్లకు దరఖాస్తు చేయాల్సి వస్తోంది. ఆర్‌ఐలు విచారణ జరిపి, రేషన్‌కార్డు ఆధారంగా ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. అయితే, పింఛన్ల దరఖాస్తుకు రేషన్‌కార్డు సరిపోతుండగా, మళ్ళీ ఆదాయ ధ్రువీకరణ పత్రం అడగడం అనవసరపు భారంగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పది రోజులుగా ఈ రెండు పత్రాలు లేవని దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగడం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు నరకప్రాయంగా మారింది. శారీరక ఇబ్బందులతో పాటు ఆర్థిక భారం కూడా వారిపై పడుతోంది. పింఛన్ల దరఖాస్తులో ఓటరు ఐడీ, ఆదాయ ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని డీఆర్‌డీఏ అధికారులు సూచించారని కిందిస్థాయి సిబ్బంది తెలిపారు. అధికారులు లబ్ధిదారుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, సరళమైన నిబంధనలను రూపొందించాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.