సూర్యాపేట జిల్లాలో కొందరు పోలీసు అధికారుల తీరు ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. సమాజానికి రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఇలాంటి పనులకు పాల్పడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నడిగూడెం పోలీస్ స్టేషన్‌లో పనిచేసే నాలుగు పెళ్లిళ్లు చేసుకోగా అందులో మూడో వివాహం పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికతో జరిగింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రజలు నివ్వెరపోయారు. గతంలో కూడా ఇతను ఇసుక వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోక్సో కేసు నమోదు..ఈ ఘటనపై సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ స్పందించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ కృష్ణంరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయించారు. నిబంధనలను ఉల్లంఘించి మైనర్‌ను వివాహం చేసుకున్నందుకు గాను, అతడిని సస్పెండ్ చేశారు. ఇలాంటి చర్యలు పోలీసులకు తీవ్రమైన అవమానమని అధికారులు అంటున్నారు. ప్రజా రక్షకులే ఇలాంటి నేరాలకు పాల్పడితే సమాజం ఎలా ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొక ఘటన.. సూర్యాపేట జిల్లాలో ఇలాంటి ఘటన ఇది ఒక్కటే కాదు. ఇటీవల కాలంలోనే నూతనకల్ ఎస్సై ప్రవీణ్ కుమార్ ఒక మహిళా కానిస్టేబుల్‌ను వేధించినట్లు ఆరోపణలు రావడంతో అతనిపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. గతంలో కూడా అతనిపై పలు ఆరోపణలు ఉండడం గమనార్హం. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించేవారిని ఎంతటి వారైనా సరే ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు. ఈ ఘటనలన్నీ పోలీసు వ్యవస్థలో క్రమశిక్షణ లోపాలను సూచిస్తున్నాయి. ప్రజా రక్షక వ్యవస్థలో ఉన్న వ్యక్తులు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం చాలా తీవ్రమైన విషయం. ఇలాంటి చర్యల వల్ల పోలీసుల పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం సన్నగిల్లుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా ప్రజలకు సేవ చేయాల్సిన వారు, తమ బాధ్యతలను గుర్తుంచుకోవాలి. ఇలాంటి సంఘటనలు సమాజానికి మంచివి కావు. ఉన్నతాధికారులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా.. వ్యవస్థలో అవినీతి, అక్రమాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.