ఏపీలో వారికి ఎగిరి గంతేసే వార్త.. ఏటా రూ.25 వేలు.!

Wait 5 sec.

రాష్ట్రంలోని చేనేతలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. రాష్ట్రంలో త్వరలోనే నేతన్న భరోసా పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేలు ఇవ్వనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. అదే రోజున సెలూన్లకు కూడా ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 40 వేల సెలూన్లకు ప్రతి నెలా 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందించనున్నట్టు చంద్రబాబు వివరించారు. నేతన్న భరోసా పథకం కింద అర్హులైన చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.25 వేలు అందించనున్నారు. మరోవైపు చేనేతలకు అండగా నిలిచేందుకు ఇప్పటికే నేత కుటుంబాలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. అలాగే చేనేత వస్త్రాలపై ఐదు శాతం జీఎస్టీని కూడా ప్రభుత్వమే భరిస్తుందని చంద్రబాబు ఇప్పటికే హామీ ఇచ్చారు.ఇక రాజధాని అమరావతిలో త్వరలోనే హ్యాండ్ లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ నేతన్న భరోసా పథకం అమల్లోకి రానుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.48.8 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. చేనేత కార్మికులతో పాటుగా.. డైయింగ్, టైయింగ్, డిజైనింగ్‌ వార్పింగ్, సైజింగ్‌, వైండింగ్ పని చేసేవారికి ఇది వర్తిస్తుంది. చేనేత అభయ హస్తం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సర్కారు ఈ నేతన్న భరోసా పథకం అమలు చేయనుంది. ఇక దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. నేతన్న భరోసా పథకం కింద ఏటా రూ.25000 లబ్ధి పొందాలంటే.. చేనేత, జౌళిశాఖ ద్వారా వారి మగ్గం జియోట్యాగ్‌ చేసుండాలి. అలాగే 18 ఏళ్లు నిండి ఉండాలి. వీవింగ్‌తో పాటుగా డైయింగ్, టైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైండింగ్, సైజింగ్‌లలో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అలాగే ఏడాది కాలంలో మగ్గం మీద కనీసం 8 నుంచి 10 వార్పులు నేసి ఉండాలని మార్గదర్శకాలు జారీచేశారు.తెలంగాణలో నిర్దేశించిన మార్గదర్శకాలే ఇంచుమించుగా ఏపీలోనూ అమలు చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇందుకు మహాలక్ష్మి, స్త్రీ శక్తి పథకాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి దీనిపై అధికారికంగా ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు. మరోవైపు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. చేనేతలకు అండగా ఉండేందుకు వీటితో పాటుగా థ్రిఫ్ట్ ఫండ్ కోసం నిధులు కూడా ఏపీ ప్రభుత్వం కేటాయించింది. ఆ రకంగా చేనేతల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం చెప్తోంది.